కోవిడ్ మహమ్మారి సమయంలో హిజాబ్‌ను సమర్థిస్తూ కర్ణాటకలో జరిగిన ఆందోళనలకు సంబంధించి కేసులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
కలబురగి జిల్లా అలంద్‌లో ‘హిజాబ్ మా హక్కు’ అని నినాదాలు చేస్తూ జహీరుద్దీన్ అన్సారీ వంటి ఆల్ఇండియా మజ్లిస్ ఎ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) నాయకుల ఆందోళనల మీద కేసులను ఉపసంహరించుకుంటూ కర్ణాటక మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. కోవిడ్ మహమ్మారి మూడో దశ వేళలో ఆ ఆందోళనలు జరిగాయి. కాబట్టి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
అయినప్పటికీ ఎంఐఎం నేతల మీద ఆరోపణలను ఉపసంహరించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, దావణగెరె జిల్లాలోని హరిహర ప్రాంతంలోని హిందూ విద్యార్ధుల మీద కేసులను మాత్రం ఉపసంహరించడానికి నిరాకరించింది. ధనుష్, మారుతి అనే ఇద్దరు విద్యార్ధుల మీద చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లరి చేయడం, హిజాబ్ వ్యతిరేక నిరసనలో భాగంగా ముస్లిం అమ్మాయిల హిజాబ్‌లు తొలగించడం అనే ఆరోపణల మీద కేసులు నమోదు చేసారు. ఆ వ్యవహారంలో విచారణ జరిపిన సబ్‌కమిటీ ఆ కేసులను ఉపసంహరించుకోవాలంటూ సిఫారసు చేసింది. ఐనా సిద్దరామయ్య సర్కారు ఆ విద్యార్ధుల మీద కేసులను మాత్రం కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ప్రభుత్వం ఈ కేసుల విషయంలో పరస్పర విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ సర్కారు ముస్లిముల సంతుష్టీకరణ, రాజకీయ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడింది.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కుంభకోణం ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం సిద్దరామయ్య ఈ సంతుష్టీకరణ నాటకాలు ఆడుతున్నారని బిజెపి కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర ఆరోపించారు. ‘‘కొన్ని కేసులను మాత్రం ఉపసంహరించుకుని, మిగతావాటిని పట్టించుకోకుండా వదిలేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగానే ఒక మతం పట్ల పక్షపాత ధోరణి చూపుతోంది’’ అని బీజేపీ సీనియర్ నేత అశ్వత్థనారాయణ్ విమర్శించారు.
కావేరీ జలాలకు సంబంధించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేంద్రమంత్రి వి సోమన్నపై పెట్టిన మూడు కేసులను ఉపసంహరించడానికి కూడా కర్ణాటక మంత్రివర్గం నిరాకరించింది.