రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తోన్న హామీలను సమీక్షించాలంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది విజయ్ అన్సారియా వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ గతంలో ఉచితాలపై వచ్చిన కేసులన్నింటిని కలిపి విచారించడానికి అంగీకరించారు.
ఎన్నికల్లో ఉచిత హామీల ద్వారా ఎన్నికల ప్రక్రియ పక్కదారి పడుతోందని న్యాయవాది విజయ్ అన్సారియా పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఉండేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఈసీకి నోటీసులు జారీ చేశారు.