మహారాష్ట్రలోని గఢ్‌చిరోలీలో ఒక మావోయిస్టు జంట సోమవారం నాడు పోలీసుల ముందు లొంగిపోయారు. వరుణ్ రాజా ముచాకీ అలియాస్ ఉంగా, రోషని విజయ… ఇద్దరి మీదా రూ.10 లక్షల నగదు బహుమతి ఉంది.
ఉంగా భమ్రాగఢ్ స్క్వాడ్ కమాండర్‌గా పనిచేసేవాడు. అదే స్క్వాడ్‌లో రోషని క్రియాశీల కార్యకర్తగా ఉండేది. ఉంగా మీద 15 కేసులున్నాయి. వాటిలో ఎక్కువ కేసులు భద్రతాబలగాలను ఎన్కౌంటర్ చేసినవే. అతని తల మీద రూ.8 లక్షల రివార్డు ఉంది. రోషని మీద సుమారు పాతిక కేసులు ఉన్నాయి. ఆమెను పట్టించిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఉంగా, రోషని జంట పోలీసులు, సిఆర్పిఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు. ప్రభుత్వ విధానం ప్రకారం వారికి రూ.11.5లక్షల నగదు ఇస్తారని పోలీసులు వెల్లడించారు.
వీరిద్దరితో కలిపి, గఢ్చిరోలీ అటవీప్రాంతంలో 2022 నుంచి ఇప్పటివరకూ పోలీసుల ముందు లొంగిపోయిన కరడుగట్టిన మావోయిస్టుల సంఖ్య 27కు చేరింది.