ఆర్జికర్ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ పశ్చిమబెంగాల్లోని జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. కోల్కతాలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జూనియర్ డాక్టర్ పులస్థ ఆచార్యకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరో జూనియర్ డాక్టర్ తాన్యా ఆరోగ్యం కూడా క్షీణించింది. పది మంది జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వీరిలో ఇప్పటికే ముగ్గురి ఆరోగ్యం క్షీణించింది. వారిని ఆసుపత్రులకు తరలించారు.
వైద్యులను బెంగాల్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. దీంతో ఆలిండియా మెడికల్ అసోషియేషన్ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ప్రభుత్వంతో అక్టోబరు 15 వరకు చర్చలు జరుపుతామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెకు వెళతామని డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం అత్వసర సేవలు మాత్రమే అందిస్తున్నామన్నారు. వైద్యులను బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు ఆహ్వానించారు. నేటి నుంచి చర్చలు జరగనున్నాయి. విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ పెంచాలని జుడాలు డిమాండ్ చేస్తున్నారు.