తెలంగాణ సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ఆదివారం అర్ధరాత్రి దాటాక, తెల్లవారితే సోమవారం అనగా, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. గుడిలో రాత్రి శబ్దాలు రావడంతో మేలుకొన్న స్థానికులు ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు, గుడిపై దాడిచేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీం ఠాకూర్ అని గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో స్థానికులు అప్పగించిన వ్యక్తిని పోలీసులు విచారణ చేసారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్‌లోని మెట్రోపోలిస్ హోటల్లో సోదాలు చేసారు. హోటల్లోని మూడవ, నాలుగవ అంతస్తుల్లో యాభై గదులను పలువురు ఆగంతకులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీం ఠాకూర్ ముంబైలోని థానే నుంచి సికింద్రాబాద్ వచ్చాడు. గుడికి వంద మీటర్ల దూరంలో ఉన్న మెట్రోపోలిస్ హోటల్లో బసచేసాడు. ప్రతీ శుక్రవారం దగ్గరలోని మసీదుకు వెళ్ళి వస్తుండేవాడని తేలింది.
కుమ్మరిగూడ ప్రాంతంలో కేవలం 200 మీటర్ల వ్యాసార్ధం పరిధిలో మూడు మసీదులున్నాయి. పక్కనే ఉన్న మోండామార్కెట్ ఏరియాలో మరో ఆరు మసీదులున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆ మసీదుల్లో ఆశ్రయం ఇస్తుండడం ఆందోళన కలిగించే అంశం. స్థానికంగా ఉండే కొందరు రాజకీయ నాయకులు, మతగురువులు చట్టాన్ని ఉల్లంఘించి బైటి(దేశాల?)వారికి సాయం చేస్తున్నారన్న సందేహాలూ ఉన్నాయి. అటువంటివారే అక్కడ మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం నాలుగైదేళ్ళ క్రితం వరకూ కుమ్మరిగూడ ప్రాంతంలో ముస్లిం కుటుంబాలు నాలుగైదు మాత్రమే ఉండేవి. మిగతా అందరూ హిందువులే ఉండేవారు. ఆ ముస్లిములు క్రమంగా తమ ఇళ్ళను మసీదులుగా మార్చి, ఇతర ప్రాంతాల నుంచి ముస్లిములను అక్కడికి శుక్రవారం నమాజుల కోసం ఆహ్వానించే వారు. మసీదుల అభివృద్ధికి, వాటిలో సౌకర్యాల కల్పనకూ నిధులు కూడా సమీకరించేవారు.
నిజానికి ముత్యాలమ్మ గుడి సంఘటనను పోలీసులు మొదట దొంగతనం వ్యవహారంగా మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికుల నుంచి ఒత్తిళ్ళు పెరగడంతో విచారణ వేగంగా జరిగింది. క్రమంగా అధికారులు సైతం ఇటువంటి సంఘటనల వెనుక ఒక విస్తృతమైన నెట్వర్క్ ఉందనే నిర్ణయానికి వచ్చారు.
తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ ఘటనకు బాధ్యులుగా భావించి ప్రచారం చేసారు.
సంఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, స్థానిక బీజేపీ నేతలు దర్శించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేసారు. అక్కడ ఆందోళన చేపట్టిన మాధవీలత, తదితర బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.