దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ క్యూ2 (reliance Q2 results) ఫలితాలు ప్రకటించింది. గత క్యూ2 ఫలితాల కన్నా 5 శాతం లాభాలు తగ్గాయి. ఆయిల్ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ వ్యాపారాలు ప్రతికూల ఫలితాలు చూపాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబరు క్యూ2లో నికరలాభం రూ.16563 కోట్లకు పరిమితమైంది. ఒక్కో షేరుకు రూ.24.48గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రిలయన్స్ రూ.17394 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.క్యూ2లో ఆదాయం 2.38 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. టెలికం, రిటైల్ రంగాలు రాణించాయి.
అధిక అప్పుల వల్ల వ్యయాలు 5 శాతం పెరిగాయి. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి పెరిగింది. రిలయన్స్ అప్పులు రూ.2.95 లక్షల కోట్ల నుంచి, రూ.3.36 లక్షల కోట్లకు పెరిగాయి. నగదు నిల్వలు రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబరు చివరి నాటికి నికరలాభాలు మొత్తం రూ.1.17 లక్షల కోట్లుగా ఉంది.
రిలయన్స్ జియో 25 శాతం వృద్ధి నమోదు చేసింది. క్యూ2లో రూ.6539 కోట్లకు చేరుకుంది. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం రూ.181 నుంచి 195కు పెరిగింది. జియో వినియోగదారుల సంఖ్య 48 కోట్లకు చేరింది. రిలయన్స్ ప్రతిష్ఠాత్మకంగా మొదలు పెట్టిన గిగా ఫ్యాక్టరీ పనులు అనుకున్న ప్రకారం సాగుతున్నాయని సంస్థ అధిపతి తెలిపారు. ఏడాది చివరినాటికి గిగా ఫ్యాక్టరీ నుంచి సోలార్ ఫ్యానెళ్లు బయటకు వస్తాయన్నారు.