ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా రెహువా మన్సూర్ గ్రామంలో ఆదివారం మతఘర్షణలు చెలరేగాయి. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపు మీద ముస్లిములు రాళ్ళదాడికి పాల్పడ్డారు. ఆ ఘర్షణల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు.
హార్దీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం దుర్గాదేవి నిమజ్జన ఊరేగింపు కోలాహలంగా సాగుతోంది. డీజే మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఊరేగింపు దారిలో ఒక మసీదు ఉంది. అక్కడి ముస్లిములు డీజే వినబడడానికి వీల్లేదంటూ ఊరేగింపు మీద దాడి చేసారు. ఊరేగింపు మీద, దుర్గాదేవి విగ్రహం మీద రాళ్ళు రువ్వారు. తమపై రాళ్ళు రువ్విన వారిని అరెస్ట్ చేయాలంటూ హిందువులు పట్టుపట్టారు. మరోవైపు, ముస్లిములు ఆ మసీదు దగ్గరకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోయాయి.
ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో 22 ఏళ్ళ రాంగోపాల్ మిశ్రా అనే యువకుడికి 15-20 బులెట్ గాయాలయ్యాయి. అతన్నే లక్ష్యంగా చేసుకుని కాల్చడం మీద వేర్వేరు కథనాలు వినవస్తున్నాయి. రాంగోపాల్ మిశ్రా ఒక ముస్లిం ఇంటిమీది ఆకుపచ్చని జెండా తొలగించి కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించాడని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే అతని తల్లిదండ్రులు మరోలా చెబుతున్నారు. తమ కొడుకును పోలీసులే అబ్దుల్ హమీద్ అనే ముస్లిం ఇంట్లో నిర్బంధించారని, తాము ఎంత వేడుకున్నా తమను అక్కడకు వెళ్ళనీయలేదనీ వాపోయారు. హమీద్ ఇంట్లో ఉండగానే తమ కొడుకును కాల్చి చంపేసారని ఆవేదన చెందుతున్నారు.
రాంగోపాల్ మిశ్రాను బహ్రెయిచ్ వైద్యకళాశాలకు తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతుండగానే అతను తుదిశ్వాస విడిచాడు. రాంగోపాల్ మరణంతో ఆ ప్రాంతం ఒక్కసారి భగ్గుమంది. అతని కుటుంబ సభ్యులు, ఊరేగింపులో పాల్గొన్న ఇతరులూ కలిసి మెడికల్ కాలేజీ బైట నిరసన కార్యక్రమం చేపట్టారు. మృతుడికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసారు.
ఈ గొడవల్లో, నగరంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలన్నీ నిలిపివేసారు. ధ్వంసమైన విగ్రహాలను హిందువుల నిరసనకు చిహ్నంగా జంక్షన్‌లో వదిలేసారు. తర్వాత ఆందోళనకారులు ఆ ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడ్డారు. నాలుగు ఇళ్ళకు, పలు వాహనాలకూ నిప్పు పెట్టారు.
రాంగోపాల్ మిశ్రా కుటుంబ సభ్యులు, ఊరేగింపులో పాల్గొన్న ఇతర హిందువులూ పోలీసులను తప్పుపట్టారు. వారు పరిస్థితిని ముందుగానే అదుపు చేయగలిగి కూడా ఆ పని చేయలేదనీ, గొడవ మొదలయ్యాక కూడా వారు ముస్లిముల పక్షం తీసుకుని హిందువుల మీదనే లాఠీచార్జి చేసారనీ చెబుతున్నారు.
సుమారు రెండు గంటల పాటు హింసాకాండ జరిగాక పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడ పెద్దయెత్తున పోలీసు బలగాలను మోహరించి, ఇంకెలాంటి ఘర్షణలూ జరగకుండా కట్టుదిట్టం చేసారు. అమ్మవారి నిమజ్జనం పూర్తిచేయాలంటూ హిందువులను కోరారు. కానీ రాంగోపాల్ మిశ్రా హత్యకు న్యాయం జరగనంత వరకూ నిమజ్జనం చేయబోమంటూ హిందువులు తిరస్కరించారు.
జరిగిన హింసాకాండను ఖండిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఎక్స్’లో ప్రకటన చేసారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ‘పండుగల వేళల్లో సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి చర్యలను సహించే ప్రసక్తే లేదు’ అని యోగి స్పష్టం చేసారు. తర్వాత ఊరేగింపు, నిమజ్జనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. బహ్రెయిచ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.