బిహార్‌లోని సీతామఢి జిల్లా బెల్సండ్ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది దుండగులు రాళ్ళురువ్వి దాడిచేసారు. ఆ సంఘటనలో పోలీసులు సహా డజను మంది గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఊరేగింపు మీద కొంతమంది అసాంఘిక శక్తులు రాళ్ళు రువ్వడంతో గొడవ మొదలైంది. పన్నెండు మందికి గాయాలయ్యాయి. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
దుండగులు రాళ్ళు రువ్వడంతో ఆగలేదు, ఆ తర్వాత వారు ఆ ప్రాంతంలోని రెండు దుకాణాలను ధ్వంసం చేసారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఊరేగింపును దారి మళ్ళించాలని ప్రయత్నించారు. దాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అసలు దాడికి పాల్పడిన దుండగుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. అమ్మవారి విగ్రహాలను ఘాట్ వద్దే నిమజ్జనం చేయకుండా వదిలేసారు.
సంఘటన గురించి తెలిసాక పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. అదనపు బలగాలను మోహరించారు. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తయింది.
సీతామఢి ప్రాంతంలో ఒక మతగ్రంథాన్ని తగులబెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించాయి. దాంతో ఆ మతానికి చెందినవారు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని వదిలిపెట్టబోమంటూ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని కచ్చితంగా శిక్షిస్తామనీ పోలీసులు ప్రకటించారు. దుండగులను గుర్తుపట్టడానికి సిసిటివి, డ్రోన్ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.