ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి. లక్షలాది భక్తులు పాల్గొనే ఆ కార్యక్రమం ఇప్పటినుంచే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మారిషస్, కాంబోడియా, దక్షిణ కొరియా, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, ఫిజీ, లావోస్, మలేసియా, వియత్నాం, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, రష్యా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ తదితర దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఇతర దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపించారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని, అంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగల భారతదేశపు సామర్థ్యాన్నీ ప్రపంచానికి చూపించడానికే అంతర్జాతీయ దౌత్యవేత్తలను ఆహ్వానించారు.
ఇలా దౌత్యవేత్తలను ఆహ్వానించడం రెండురకాలుగా ప్రయోజనకరం. మహాకుంభమేళా వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించి తద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం మొదటి కారణం. ఇంక రెండోది, భారత్‌కు ఆయా దేశాలతో దౌత్య సంబంధాలు మరింత బలపడతాయన్నది రెండో కారణం. యూపీ ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రస్థానంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. దానికి మహాకుంభమేళా ఓ గొప్ప అవకాశంగా నిలుస్తుంది.
మహాకుంభ్ సందర్భంగా భక్తులు, పర్యాటకులు, అంతర్జాతీయ అతిథుల రక్షణ, భద్రత కోసం యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శాంతిభద్రతల పరిస్థితిని పరిరక్షించడానికి 60వేలకు పైగా పోలీసులను మోహరిస్తారు. జనసందోహాన్ని పర్యవేక్షించడానికి సిసిటివి నిఘా, డ్రోన్ల పర్యవేక్షణ వంటి నియంత్రణ పద్ధతులను ఉపయోగిస్తారు. అత్యవసర పరిస్థితులను, అవాంఛిత సంఘటనలనూ నివారించడానికి ప్రత్యేక తక్షణ స్పందన బృందా (క్యుఆర్‌టి) లను ఏర్పాటు చేస్తారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలను తీసుకొస్తారు.
మహాకుంభమేళా జరిగే ప్రధాన ప్రాంతాల్లో మొబైల్ హెల్త్‌కేర్ యూనిట్లు, ఆంబులెన్సులూ అందుబాటులో ఉంచుతారు. త్రివేణీ సంగమం దగ్గర పెద్దసంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికుల రద్దీని తట్టుకోడానికి వెయ్యి ప్రత్యేక రైళ్ళను నడపనున్నారు. యూపీస్టేట్ ఆర్‌టీసీ వందలాది అదనపు బస్సులు నడపనుంది. మహాకుంభమేళా వేదికకు దగ్గరలో తాత్కాలిక బస్‌స్టాప్‌లు, ట్రాన్సిట్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. 2025 మహాకుంభమేళాకు 50కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని యూపీఎస్‌ఆర్‌టీసీ లఖ్‌నవూ డివిజన్ సీనియర్ డివినజనల్ కమర్షియల్ మేనేజర్ కులదీప్ తివారీ అంచనా వేసారు. అదే నిజమైతే వచ్చేయేడాది జరిగే కుంభమేళా చరిత్రలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
కుంభమేళా కోసం ప్రయాగరాజ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించారు. రహదారుల అప్‌గ్రెడేషన్, పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరచడం, స్వచ్ఛమైన పరిశుభ్రమైన తాగునీరు అందరికీ అందేలా చేయడం కోసం తగినంత బడ్జెట్ కేటాయించింది యూపీ ప్రభుత్వం. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం తాత్కాలిక ఆశ్రయాలుగా టెంట్లు, షెల్టర్లు నిర్మించడం మొదలైంది. వాటన్నింటిలోనూ తాగునీరు, శానిటేషన్, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పిస్తారు. పరిసరాల పరిశుభ్రత కోసం శానిటేషన్ వర్కర్స్‌ను పెద్దసంఖ్యలో నియమించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేకమైన స్థలాలు, ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. అలా, 2025 మహాకుంభమేళాను చిరస్మరణీయంగా నిర్వహించడానికి యూపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.