బలమైన, అనుభవం కలిగిన నాయకత్వంలో పనిచేయడం వల్లే ఏపీకి మంచిరోజులొచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లెపండుగ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 వేల పంచాయతీల్లో మౌలికసదుపాయాల కల్పనకు రూ.4500 కోట్లు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రోబోయే రోజుల్లో ప్రతి పల్లెలో ప్రతిఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఏడాదిలో 3 వేల కి.మీ సిమెంటు రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఉపాధిహామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు అందిస్తోందని, ఆ నిధుల ద్వారా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో 46 గ్రామాలకు శాశ్వత మంచినీటి పథకాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి గ్రామానికి మంచిరహదారి ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.
అవినీతికి తావులేని పాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఓ ఐఏఎస్ అధికారి తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అదే నిజమైతే అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.