తిరువళ్లూరు జిల్లా కరవైపెట్టై స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం దాగిఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రధాన మార్గంలో కాకుండా లూప్లైనులోకి ప్రవేశించి గూడ్సు రైలును ఢీ కొనడంపై జాతీయ దర్యాప్తు సంస్థ, రైల్వేపోలీసులు విచారణ సాగిస్తున్నారు. గత ఏడాది ఒడిషాలోని బాలాషోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలో జరగడంతో పలు అనుమానాలు బలపడుతున్నాయి.
భాగమతి ఎక్స్ప్రెస్ కవరైపెట్టై స్టేషన్ దాటే ముందు, సరిగ్గా 7 నిమిషాల ముందు మరో ట్రైన్ ప్రధాన మార్గంలో వెళ్లింది. భాగమతి రైలు కూడా ప్రధాన మార్గంలో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా అది లూప్ లైనులోకి ప్రవేశించి గూడ్సు రైలును ఢీ కొట్టింది. ప్రయాణీకులు ఎవరూ మరణించపోయినా, 12 బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందా? సాంకేతిక లోపాల వల్ల జరిగిందా అనే విషయాలను తేల్చేందుకు ఎన్ఐఏ సహా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.