బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తుపాను తీరందాటే అవకాశముందని ఐఎండి అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 2 నుంచి 6సెం.మీ వర్షపాతం నమోదైంది.
ప్రభుత్వం తుపాను రక్షణ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విపత్తు నిర్వహణ సంస్థను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.