విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భవానీ దీక్షదారులు పోటెత్తారు. భవానీ మాల ధారణ చేపట్టిన స్వాములు విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఆలయం నుంచి బస్టాండ్ వరకు కిలోమీటర్ల మేరా వేల సంఖ్యలో క్యూలైన్లలో భవానీలు వేచి ఉన్నారు.
భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, క్యూలైన్ల ద్వారా భక్తులను కొండపైకి పంపుతున్నారు. భవానీలు మెట్ల మార్గం ద్వారా కిందకు చేరుకుని మహా మండపం దిగువన ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో మాలను విరమిస్తున్నారు. అక్కడే అందజేస్తున్న అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
క్యూలైన్లలో మహిళలు, పిల్లలు, వృద్ధ స్వాములు కూడా ఉండడంతో వారికోసం పాలు, బిస్కెట్లు, మజ్జిగ అందజేస్తున్నారు.