ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది.
బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉండగా పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన సిద్దిఖీని వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కేసులో అరెస్టైన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ ను అరెస్టు చేయగా వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు.
మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ హత్య చేసినందుకు గాను నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్ గ్యాంగ్ రూ.50,000 అడ్వాన్స్, మారణాయుధాలు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ‘ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.