ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్దిఖీ శనివారంనాడు ముంబైలో దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ఎన్సీపీ కార్యాలయంలో ముగ్గురు దుండగులు దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో బాబా సిద్దిఖీ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సిద్దిఖీని హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.
సిద్దిఖీ హత్య తరవాత పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. సిద్దిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ హత్యతో ముంబై నగరం ఉలిక్కి పడింది. పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. పలువురు ప్రముఖులు లీలావతి ఆసుపత్రికి చేరుకుని బాబా సిద్దిఖీ కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ షూటింగ్ ఆపేసి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. బాబా సిద్దిఖీ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.