శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
దర్శన సమయం వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని తెలిపింది. ఈ మార్పుల ద్వారా భక్తులకు 17 గంటల సుదీర్ఘ సమయం దర్శనానికి లభిస్తుంది.
ఇక, ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సం నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.
ఈ దఫా శబరిమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం ఆన్లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం తెలిపింది. స్పాట్ బుకింగ్ ఉండదని, ఆన్లైన్ బుకింగ్స్ చేసుకున్న భక్తులకు 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తామని తెలిపింది. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.