క్రోధి నామ సంవత్సర విజయదశమి పర్వదినం 2024 అక్టోబర్ 12న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి జరుపుకొంది. దేశంలో జాతీయవాదాన్ని, క్రమశిక్షణను, సామాజిక అభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. అదే సమయంలో సంఘ్ మహిళా విభాగమైన రాష్ట్ర సేవికా సమితి కూడ విజయదశమి పర్వదినానే స్థాపితమైంది. 1936లో అక్టోబర్ 25వ తేదీన భారతీయ కాలమానం ప్రకారం విజయదశమి శుభతిథి. ఆ సందర్భంగా రాష్ట్ర సేవికా సమితిని స్థాపించారు. ఈ రెండు సంస్థలకూ లక్ష్యం ఒకటే దేశసేవ. వాటి పనితీరులో మాత్రమే చిన్నచిన్న తేడాలు ఉంటాయి. మన సమాజంలో స్త్రీ పురుషులు పోషించే పాత్రల్లోని చిన్నచిన్న తేడాలే ఈ రెండు సంస్థలకూ ఉన్న తేడాలు. అంతే. మిగతా పనితీరు అంతా ఒకటే.
సంఘం, సమితి రెండూ ఒకే భావజాలాన్ని కలిగి ఉన్నాయి. అవి దేశసేవ, హిందూ సంస్కృతి సముద్ధరణ. రెండు సంస్థల కార్యకలాపాల్లోనూ క్రీడలు, శారీరక వ్యాయామం, మేధో కార్యక్రమాలు ప్రధానమైనవి. క్రమశిక్షణ, నైతిక విలువలు, శీల నిర్మాణం మీద పూర్తి దృష్టి కేంద్రీకరించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా శారీరక బలం, మానసిక పటుత్వం, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండే దృష్టిని పెంపొందించాలన్నదే వాటి ఉద్దేశం.
శాఖల ఏర్పాటు లక్ష్యం రెండు సంస్థల్లోనూ ఒకటే. స్వయంసేవకులు లేదా సేవికలు శారీరక వ్యాయామాలు చేయడం, మేధోపరమైన చర్చలు జరపడం, నాయకత్వం-సామాజిక సేవలకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శాఖలు కేంద్రాలుగా పనిచేస్తాయి. అయితే లక్ష్యాలు, కార్యక్రమాల్లో పోలికలతో పాటు ఈ రెండు సంస్థల శాఖల నిర్మాణంలోనూ, పనితీరులోనూ కొన్ని కీలకమైన తేడాలున్నాయి.
శాఖా నిర్మాణం, పనితీరులో భేదాలు:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి మధ్య ప్రధానమైన తేడా వాటి ప్రార్థనల్లో ఉంటుంది. రెండు సంస్థల శాఖలూ ప్రార్థనతోనే మొదలవుతాయి. అయితే ఆ ప్రార్థనల్లోని పదాలు, సారాంశంలో కొన్ని తేడాలు ఉంటాయి.
మరో ప్రధానమైన తేడా శాఖల నిర్వహించే రోజులు. సంఘంలో శాఖలను సాధారణంగా ప్రతీరోజూ నిర్వహిస్తారు. సాధారణంగా పురుషులకు ప్రతీరోజూ సమావేశాలకు హాజరవడానికి వీలు ఎక్కువ ఉంటుంది. అయితే మహిళలకు గృహనిర్వహణ బాధ్యతల కారణంగా ప్రతీరోజూ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కొంచెం తక్కువే. అందువల్ల సమితి శాఖలు సామాన్యంగా వారానికి ఒకరోజు నిర్వహించుకుంటారు. వారి వ్యక్తిగత బాధ్యతలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా వారి వెసులుబాటును బట్టి శాఖలు నిర్వహించుకునే అవకాశం ఉంది.
అలాగే శాఖల సమయాలు కూడా మారుతుంటాయి. ఆర్ఎస్ఎస్ శాఖలు సాధారణంగా తెల్లవారుజామున, లేదా ఉదయం వేళల్లో నిర్వహిస్తూంటారు. సమితి శాఖలు ఉదయం కొంచెం ఆలస్యంగానో, మధ్యాహ్నమో లేక సాయంత్రం వేళల్లోనో జరుగుతాయి. సమితి శాఖకు వచ్చే మహిళలకు కుటుంబ బాధ్యతలు, వ్యవస్థాగత కార్యక్రమాల మధ్య సమతౌల్యం చూసుకునేలా వీలును బట్టి సమయం నిర్ణయించుకుంటారు.
రాష్ట్ర సేవికా సమితిలో మహిళల శారీరక, మానసిక, నైతిక అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వార్షిక సమావేశాలు, వనవిహారాలు, అన్ని వయస్సులకు మహిళలకూ శిబిరాలు నిర్వహిస్తారు. రాష్ట్ర సేవికా సమితి ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ఆరోగ్య శిబిరాలు, హాస్టళ్ళు, వొకేషనల్ ఎడ్యుకేషన్ శిక్షణా శిబిరాలు, పిల్లలకు బాలమందిర్ సంస్కార్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సేవికా సమితి దేశవ్యాప్తంగా 22 హాస్టళ్ళు నడుపుతోంది. అమ్మాయిల చదువుల నుంచి పెళ్ళిళ్ళ వరకూ బాధ్యత స్వీకరించింది. హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేయడం, హిందూ సమాజాన్ని బలపరచడం, భారతీయ సంస్కృతిని, దాని నాగరికతా విలువలనూ ప్రచారం చేయడం అనేవి ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ సంస్థల ప్రధాన లక్ష్యం. అదే సమయంలో దేశానికి అవసరమైన ప్రతీసారీ సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్ ముందంజలో ఉంటుంది.
తమతమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి భారతదేశపు సామాజిక-సాంస్కృతిక స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తమవైన పరస్పర పూరకాలైన విధానాలతో దేశ సేవలో తమ భూమికను నిర్వర్తిస్తున్నాయి.