జడల బర్రెలను ఉపయోగించే విషయంలో ట్రయల్స్
కొండప్రాంత సరిహద్దులో భద్రత, ఇతర అవసరాల కోసం భారత సైన్యం జంతువుల సేవలను ఉపయోగించేందుకు సిద్ధమైంది. లద్ధాఖ్‌లో ప్రతికూల వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం, పహారా కాసేందుకు, సామగ్రి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
లేహ్‌లోని డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (DIHAR) రెండు మాపురాల ఒంటెలకు శిక్షణ ఇస్తోంది. వీటినే బాక్ట్రియన్ ఒంటెలు అంటారు. బందోబస్తుకు ఉపయోగపడేలా, యుద్ధ సమయంలో బరువులు మోసేందుకు సహకరించేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుందని ఆర్మీ అధికారులు తెలిపారు.
పర్వతాల్లోని రవాణాకు ఇప్పటికీ జన్స్కర్ వంటి గుర్రాలపై ఆర్మీ ఆధారపడుతోంది. లద్ధాక్ సెక్టార్ లో సామగ్రి చేరవేతకు 1999 కార్గిల్ యుద్దం నుంచి జన్స్కర్ల సేవలు వినియోగించుకున్నారు. చైనా సరిహద్దున తూర్పు లద్ధాఖ్ లో బాక్ట్రియన్ ఒంటెలతో నిర్వహించిన ప్రాధమిక పరీక్షలు విజయవంతం అయ్యాయి. జడల బర్రెలను ఉపయోగించడంపైనా ట్రయల్స్ జరుగుతున్నాయి.
దృఢంగా ఉండే బాక్ట్రియన్ ఒంటెలు ఎత్తైన ప్రాంతాల్లో జీవించడతో పాటు రెండు వారాల పాటు ఆహారం తీసుకోకుండా కూడా ఉండగలిగే శక్తి వాటికి ఉంది. దాదాపు 150 కిలోలకుపైగా బరువును అవలీలగా మోస్తాయి. అతిశీతల వాతావరణాన్ని కూడా తట్టుకుంటాయి.