ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 14 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వివరించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం , జిల్లాల కలెక్టర్లకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక సూచనలు చేశారు. పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సంయుక్తంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాలని ఆదేశించారు.
అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని వివరించారు. వాగులు పొంగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో హెచ్చిరకలు జారీ చేయాలన్నారు. అవసరమైన సమాచారం కోసం కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 1800 425 -0101 ను సంప్రదించాలని సూచించారు.