కర్రల సమరంలో మరోసారి వందల మంది భక్తుల తలలు పగిలాయి. కర్నూలు జిల్లా హోళిగుంద మండలం దేవరగట్టులో ఏటా దసరానాడు బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవరగట్టు గ్రామ సమీపంలో కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, మరోవైపు అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, విరుపాపురం, బిలేహాల్ గ్రామల భక్తులు కర్రలతో తలపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన కర్రల సమయంలో వంద మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంలో వారిని, ఆదోని ఆసుపత్రికి తరలించారు.
దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. 9 గ్రామాల భక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో తలలపై కొట్టుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో వందలాది భక్తులకు ఏటా గాయాలవుతూ ఉంటాయి. స్వల్పగాయాలైన వారు పసుపు రాసుకుని ఇంటికి వెళ్లిపోతుంటారు. తీవ్రంగా గాయపడ్డవారిని సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో కొందరు కర్రలకు రింగులు తొడిగి సమరంలోకి రావడంతో తీవ్ర గాయాలవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.