వర్తమాన ప్రపంచంలో భారతదేశపు ఎదుగుదలను ఓర్చుకోలేని కొన్ని ప్రతీపశక్తులు ఆ ఎదుగుదలను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక దినం విజయదశమి సందర్భంగా నాగపూర్‌లో స్వయంసేవకులను ఉద్దేశించి సంస్థ సర్‌సంఘచాలక్ మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేసారు. తమను తాము ఉదారవాద, ప్రజాస్వామ్య దేశాలనీ, ప్రపంచశాంతికి కట్టుబడి ఉన్నామనీ చెప్పుకునే దేశాల నిబద్ధత, వాటి స్వీయ ఆసక్తుల ముందు మాయమైపోతుందని భాగవత్ గమనించారు. అటువంటి దేశాలే తమ స్వార్థం కోసం ఇతర దేశాల మీద దాడులు చేయడానికి, అక్కడి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడానికీ అక్రమంగానూ హింసాయుతంగానూ ప్రయత్నించడానికి ఏమాత్రం సిగ్గుపడవని భాగవత్ చెప్పారు. భారతదేశంలో అంతర్గతంగానూ, ఇతర ప్రపంచ దేశాల్లోనూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆ విషయం సులువుగానే అర్ధమవుతుందని వివరించారు. భారతదేశపు మంచిపేరును చెడగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా అసత్యాలు, అర్ధసత్యాలతో చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో భాగవత్ ఆందోళన వ్యక్తం చేసారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక కుట్రకు స్థానిక, తక్షణ కారణాలు ఉన్నాయనడం ఒక దృక్కోణం మాత్రమే. అక్కడి హిందువులు ఏమీ రెచ్చగొట్టకపోయినా వారిపై హింసాత్మక దాడులు పునరావృతం అవుతున్నాయి. ఈసారి అలాంటి దాడులకు వ్యతిరేకంగా అక్కడి హిందూసమాజం కొంతమేర ఏకమైంది. ఆత్మరక్షణ కోసం ఇళ్ళు వదిలి బైటకు వచ్చారు. దాంతో కొద్దిగానైనా ప్రతిఘటన కనిపించింది. కానీ ఆ నిరంకుశ మతఛాందస ధోరణి మనుగడలో ఉన్నంతవరకూ హిందువులు సహా అన్ని మైనారిటీ వర్గాల తలల మీదా ప్రమాదమనే కత్తి వేలాడుతూనే ఉంటుంది. అందుకే బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు, దానివల్ల జనాభాలో పెరుగుతున్న అసమతౌల్యం సామాన్య భారతీయులకు సైతం ఆందోళనకరంగా తయారైంది. ఈ అక్రమ చొరబాట్ల వల్ల పరస్పర సామరస్యం, జాతిభద్రత ప్రమాదంలో పడుతున్నాయి’’ అని భాగవత్ ఆందోళన చెందారు.
‘‘బంగ్లాదేశ్‌లో మైనారిటీల స్థాయికి పడిపోయిన హిందూ సమాజానికి ఉదారత మానవత్వం సామరస్యం అనే భావాల పట్ల విశ్వాసమున్న అందరి సహకారం కావాలి. ప్రత్యేకించి భారత ప్రభుత్వము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి అండగా నిలవాలి. బంగ్లాదేశ్ హిందువులను చూసి వారిలా అసంఘటితంగా, బలహీనంగా ఉండడం అనేది దుష్టుల అరాచకాలను ఆహ్వానించడమే అన్న పాఠం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం చర్చ నడుస్తోందో తెలుసా? భారత్‌ను ఎదుర్కోడానికి పాకిస్తాన్‌తో చేతులు కలపడానికి చర్చలు జరుగుతున్నాయి. అటువంటి తప్పుడు ప్రచారాలను సృష్టించి వ్యాపింపజేయడం ద్వారా భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించే దేశాల పేర్లను ప్రత్యేకించి ప్రస్తావించనవసరం లేదు. దానికి పరిష్కారం కనుగొనడం ప్రభుత్వం చేయవలసిన పని. కానీ సామాజిక స్థాయిలో చూస్తే మన సమాజంలో మనుగడలో ఉన్న సంస్కృతిని, హుందాతనాన్నీ నాశనం చేయడానికి, వైవిధ్యాన్ని విభేదాలుగా మార్చడానికీ, సమాజంలో కొన్ని సమస్యల వల్ల బాధితులుగా ఉన్నవారిని ఈ వ్యవస్థ పట్ల విశ్వాసం లేనివారిగా మలచడానికీ, అసంతృప్తిని అరాచకంగా మార్చడానికీ జరుగుతున్న ప్రయత్నాలు ముమ్మరంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది’’ అని భాగవత్ అభిప్రాయపడ్డారు.
డీప్‌స్టేట్, వోకిజం, సాంస్కృతిక మార్క్సిస్టు వంటి పదాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని డా. భాగవత్ గమనించారు. అటువంటి ధోరణులు మన సంస్కృతీ సంప్రదాయాలకు శత్రువులమని తామే ప్రకటించుకున్నాయి అని ఆయన స్పష్టం చేసారు. ‘‘ఈమధ్య డీప్‌స్టేట్, వోకిజం, కల్చరల్ మార్క్సిస్టు’ వంటి పదాలు చర్చల్లో వస్తున్నాయి. నిజానికి అవి అన్ని సంస్కృతీ సంప్రదాయాలకూ స్వయంప్రకటిత శత్రువులు. భారతీయమైన విలువలు, సంప్రదాయాలు, భారతీయుల పవిత్ర భావనలు అన్నింటినీ పూర్తిగా విధ్వంసం చేయడమే ఆ మూక విధానం. వాళ్ళ మొదటి అడుగేంటంటే సమాజపు మానసిక స్థితిని తీర్చిదిద్దే వ్యవస్థలు, సంస్థలను తమ ప్రభావంలోకి తీసుకుపోవాలి. ఉదాహరణకు విద్యావ్యవస్థ, విద్యాసంస్థలు, మీడియా, మేధోజీవులు మొదలైనవి. ఆ ఆలోచనా ధోరణులను, విలువలను, విశ్వాసాలనూ వాటిద్వారా నాశనం చేయాల్సిందే. అందరూ కలిసి నివసించే సమాజంలో ఒక ఉనికి ఆధారిత వర్గం – వాస్తవమైన లేక అసహజమైన ప్రత్యేకత, డిమాండ్, అవసరం లేక సమస్య అనే వాటి ఆధారంగా – తక్కిన వారి నుంచి విడిపోవాలని భావిస్తుంది. వారితో తాము బాధితులము అనే భావన కలిగిస్తారు. అసంతృప్తిని రగల్చడం ద్వారా ఆ వర్గాన్ని మిగతా సమాజం నుంచి విడదీస్తారు. ఆ క్రమంలో ఆ వర్గం వ్యవస్థకు వ్యతిరేకంగా అతివాద ధోరణిలో ప్రవర్తించేలా చేస్తారు. సమాజంలో తప్పులను వెతుకుతూ ఉండే క్రమంలో ప్రత్యక్ష ఘర్షణలు జరుగుతాయి. వ్యవస్థ, చట్టాలు, ప్రభుత్వం, పాలక వ్యవస్థల పట్ల అపనమ్మకం, ద్వేషం రగిలించడం ద్వారా అరాచకాన్నీ, భయభ్రాంతుల వాతావరణాన్నీ కల్పిస్తారు. అలాంటి వాతావరణంలో దేశం మీద ఒకరికి ఆధిపత్యం కట్టబెట్టడం చాలా సులువవుతుంది’’ అని భాగవత్ వివరించారు.
పరస్పర సామరస్యం, జాతీయ సమైక్యతలను కాకుండా స్వీయ ఆసక్తులే ప్రధానంగా జరిగే రాజకీయ పోటీ వల్ల విధ్వంసక అజెండాలు అమలవుతాయని డాక్టర్ భాగవత్ గమనించారు. ‘‘బహుళ పార్టీ ప్రజాస్వామిక ప్రభుత్వ విధానంలో రాజకీయ పక్షాల మధ్య అధికారం సాధించడం కోసం పోటీ ఉంటుంది. పరస్పర సామరస్యం లేక జాతీయ సమైక్యత కంటె కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలు లేదా రాజకీయ పార్టీల మధ్య పోటీయే ప్రధానమైతే, అలాంటి పార్టీ రాజకీయాల పద్ధతి వేరేగా మారిపోతుంది. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరిట తమ విధ్వంసక అజెండాను ముందుకు తీసుకువెళ్ళడానికి కొంచెం బలమైన పార్టీకి మద్దతిస్తారు. ఇదేమీ కల్పిత కథ కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో జరిగినదే. అలాంటి విప్లవం వల్ల పాశ్చాత్య ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో శాంతి, సమృద్ధి, సుస్థిరత ప్రమాదంలో పడిన సంగతి మన కళ్ళముందే ఉంది. కొన్నాళ్ళ క్రితం మధ్యప్రాచ్యంలో ‘అరబ్ స్ప్రింగ్’ లాంటి పరిణామాలే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్నాయి. భారత్ చుట్టూ, ప్రత్యేకించి సరిహద్దుల వెంబడి, గిరిజన ప్రాంతాల్లోనూ అటువంటి దుర్మార్గాలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నాం’’ అని భాగవత్ వివరించారు.
మన దేశంలో ప్రజాజీవితం… ఘనమైన నాగరికత, సాంస్కృతిక ఐకమత్యం అనే పునాదుల మీద ఆధారపడి ఉంది. మన సామాజిక జీవితం సద్భావనలు, సదాచారాల నుంచి స్ఫూర్తిపొందినది. పైన పేర్కొన్న దుష్ట పన్నాగాలు మన సమాజాన్ని విధ్వంసం చేయకుండా సకాలంలో ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మన సాంస్కృతిక మూలాలు కలిగి తాత్వికతతో రాజ్యాంగబద్ధమైన మార్గంలో నడిచే ప్రజాస్వామిక ప్రణాళికను రూపొందించాలి. ఇలాంటి కుట్రల నుంచి సమాజాన్ని రక్షించడానికి, మేధో-సాంస్కృతిక కాలుష్యం వ్యాపించకుండా నిలువరించడానికి శక్తివంతమైన ప్రయత్నం జరగడం తక్షణావసరం’’ అని ఆయన తన విజయదశమి సందేశంలో చెప్పుకొచ్చారు.