బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ చీఫ్
బలహీనంగా ఉండటం నేరమని వ్యాఖ్య
దసరా ఉత్సవాల వేళ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి ఖండించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనుల సాయం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ప్రభుత్వం సాయం చేయడం వారికి చాలా కీలకమన్నారు. బలహీనంగా ఉండడం నేరమవుతోందని మోహన్ భగవత్, ‘మనం బలహీనంగా ఉన్నామంటే నేరాలను ఆహ్వానిస్తున్నట్టే’ అన్నారు. ఎక్కడ ఉన్నా ఐక్యంగా, సాధికారికంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. దసరా ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ లో హిందువులు అకృత్యాలను ఎదుర్కొంటున్నారన్న మోహన్ భగవత్, దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడడం తరుచూ జరుగుతోందన్నారు. తొలిసారి హిందువులు వారి రక్షణ కోసం ఐక్యంగా వీధుల్లోకి వచ్చారని కొనియాడారు. బంగ్లాదేశ్లో ఇదే విధంగా దాడులు కొనసాగితే హిందువులకే కాదు, అక్కడి మైనారిటీలు అందరూ ప్రమాదంలో పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.