ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీలో బాగంగా దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వానికి 90 వేల దరఖాస్తులు అందాయి. మొత్తం 3, 396 దుకాణాలకు గాను ఈ దరఖాస్తులు అందాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.1800 కోట్లపైనే ఆదాయం సమకూరనుందని అంచనా .
కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో మరికొందరు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇక ఆఖరి రోజునే 24,014 దరఖాస్తులు అందగా ఎన్టీఆర్ జిల్లాలోని వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు రావడం గమనార్హం.
ఏలూరు జిల్లాలో ఒక్కో దుకాణానికి 37, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 34 చొప్పున దరఖాస్తులు అందాయి. కర్నూలు, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 30 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు నోటికేషన్ జారీ చేయగా రాష్ట్రంలోనే అత్యధికంగా 5,787 దరఖాస్తులు వచ్చాయి. వత్సవాయి మండలంలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120 దరఖాస్తులు వెల్లువెత్తాయి.
పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణం కోసం 110 దరఖాస్తులు రాగా, ఈ మూడూ ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని దుకాణాలే కావడం గమనార్హం.
ఈ నెల 14న జిల్లాల కలెక్టర్లు, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో వచ్చిన దరఖాస్తులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. లాటరీ దక్కినవారికి 15న దుకాణాలు కేటాయిస్తారు. ఆ తర్వాతి రోజు నుంచి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.