దేశంలో రెండేళ్ల తరవాత మొదటిసారి ఆగస్టులో పారిశ్రామికవృద్ధి క్షీణించింది. ఆగస్టులో -0.1 శాతం క్షీణించింది. విద్యుదుత్పత్తి, గనులు నిరాశాజనకమైన పనితీరు కనబరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా ఈ గణాంకాలను విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో పారిశ్రామిక వృద్ధి 10.9 శాతంగా ఉంది. జులై ఐఐపీ 4.8 శాతం నుంచి 4.7 శాతానికి సవరించారు. చివరగా 2022 అక్టోబరులో ఐఐపీ 4.1 శాతం క్షీణించింది. అప్పటి నుంచి రెండేళ్ల తరవాత మరలా ప్రతికూలంగా నమోదవడం ఇదే మొదటిసారి.
గనులు -4.3 శాతం, తయారీ రంగం -0.1 శాతం, విద్యుత్ రంగం -3.7 శాతం క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఆగస్టు మధ్య ఐఐపీ వృద్ధి 4.2గా శాతం కాగా, గతేడాది ఇదే సమయంలో 6.2 శాతంగా నమోదైంది. భారీ యంత్రాల తయారీ 13.1 శాతం నుంచి 0.7 శాతానికి పడిపోయింది. మౌలికరంగం 15.7 శాతం నుంచి 1.9 శాతానికి దిగజారింది. వర్షాకాలం కావడంతో గనుల తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వచ్చే త్రైమాసికంలో ఈ రంగాలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.