తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి తమిళనాడు మీదుగా దర్భాంగ చేరాల్సిన భాగమతి రైలు తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. వందల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు. బోగీలు చెల్లాచెదరుగా పడిపోయాయి. కొన్ని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. సహాయ సిబ్బంది, స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రయాణీకులెవరూ మరణించలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
గతేడాది ఒడిషాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలోనే ప్రస్తుత ప్రమాదం చోటు చేసుకుంది. భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రధాన మార్గంలో కాకుండా కవరైపెట్టె స్టేషన్ వద్ద లూప్ లైన్‌లో ప్రయాణం చేయడంతో అక్కడ ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో రైలు 75 కి.మీ వేగంతో ఉండటంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్శిల్ వ్యానులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.