తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున తిరుచ్చి, పల్లకీ ఉత్సవాలు నిర్వహించారు. చక్రతాళ్వార్కు వరాహస్వామి ప్రాంగణంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. చక్రత్తాళ్వార్ అంటే శ్రీవారికి ప్రతిరూపం. పుష్కరిణిలో చక్రస్నానం మరికాసేపట్లో పూర్తి కానుంది. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి ధ్వజావరోహనంతో బ్రహ్మోత్సవాలు ముగించనున్నారు.
శుక్రవారం శ్రీమలయప్పస్వామి కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్పాలంకరణ, బంగారు అభరణాలు, వజ్రవైడూర్యాలతో స్వామి వారిని కల్కి అవతారంలో మాడ వీధుల్లో ఊరేగించారు. మలయప్పస్వామి దేవేరులతో బ్రహ్మరథం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. శ్రీవారి వాహన సేవలో జీయర్ స్వాములు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పొల్గొన్నారు.