***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
నిశుంభుని మరణానికి శుంభుడు బడబానలం వలె జ్వలించాడు. పదఘట్టన, దంతతాడన, ధనుష్టంకార, సింహనాదాలు చేసాడు. జగన్మాతయగు దుర్గను సమీపించాడు. ‘‘ఓ దుర్గా! నీవు బలాభిమానంచే తొలుత గర్వంగా మాట్లాడినావు. మా ధూమ్రలోచన చండముండాదులు రాయబారులుగ వచ్చినపుడు ఏకాకినివిగా ఉండి, వారితో నన్నొక్కతెనూ జయిస్తే వివాహమాడుదనని పలికావు. యుద్ధం ప్రారంభమయేసరికి అనేకరూపాలు గల స్త్రీశక్తులను సహాయం చేసుకున్నావు. చెప్పినదానికీ చేసినదానికీ సంబంధం లేదు. పైగా అనేక మాయారూపాల్ని ధరించావు. మాయోపాయములచే రాక్షసులను సంహరించావు. ఏకాకినివిగా యుద్ధం చేస్తానని యిందరి సహాయాన్నపేక్షించడం నీ బలహీనతను వెల్లడిస్తోంది. ఒకనితో యుద్ధం చేయుటకుగాను అసంఖ్యాక మాతృకాగణాలను వెంటబెట్టుకొని నిలచియున్నావు. నీ బలాబలాలు సంపూర్ణంగా గుర్తించాను. నీకు పదునాలుగు లోకాలు సహకరించినా శుంభుని చేతినుండి తప్పించుకొనలేవు. ఇప్పుడైనను గర్వమును వదులుము; నన్ను శరణు పొందుము; ప్రాణములు నిలుపుకొనుము; నీ సహజమైన స్త్రీసాహసమును విడువు’’మన్నాడు.
శుంభుని వాక్యాలు విని దుర్గ ఇలా అంది: ‘‘ఓ శుంభా! నీవు పదునాలుగు లోకాలు జయించిన వీరుడవు, మహామాయావివి. ఇంద్రాదులచే నూడిగము చేయించుకొను ప్రతాపశాలివి; పదునాలుగులోకాలనూ పరిపాలించు రాజనీతివిశారదుడవు; అసంఖ్యాక దానవులకు నాయకుడవు. ఈకాలంలో నీతో సమానుడు ఏ లోకంలోనూ లేడు. కాని నీది దుర్మేధ. తమోగుణప్రధానుడవగుట నన్ను గుర్తించలేకున్నావు. ధూమ్రలోచనుడు మొదలు నిశుంభుని వరకూ జరిగిన రాక్షససంహారం చూచికూడా మందమతివిగానే ఉన్నావు. చండముండులవంటి వీరులు క్షణకాలములో నా క్రోధాగ్నికాహుతియైనారు. రక్తబీజునివంటి మహాయోధుడు నా ప్రతాపాగ్నిలో మిడుతయైనాడు. నిశుంభుని వంటి ఏకైకవీరుడు నా అస్త్రాగ్నికాజ్యధారయైనాడు. మిగిలిన రక్కసుల లెక్క లేనేలేదు. నీవొక్కడవు కారణంగా రాక్షస కులమంతా నశించింది. ఇప్పుడైననూ నేనెవరో గుర్తించు! నాకు సహాయంగా స్త్రీశక్తులు చాలా ఉన్నాయంటున్నావు! అందులోనే నీ మేధ అర్ధమవుతోంది. నన్ను నేనే తెలియచెబుతాను విను. నీవు రక్కసుడవైనా క్రూరుడవైనా పూర్వజన్మ సుకృతంగా నా దర్శనమైంది. నాతో సంభాషించగలిగావు. పైగా నా స్వరూపం నా ద్వారా గుర్తింపగలుగుతున్నావు. నన్నిపుడైనా గుర్తించి భవిష్యత్తును నిర్ణయించుకో.’’
‘‘ఓ శుంభదానవా! జగత్తులో నాకంటె పరమైన వస్తువే లేదు. ఉన్నదాననే నేనొక్కతెనైతే నాకంటె వేరు స్త్రీయే లేనప్పుడు నాకు సహాయమెవరు? శుంభాసురా! బ్రహ్మాండకోటులన్ని నారూపంలోనుండి నాచేతనే కల్పింపబడతాయి. నాచేతనే ఉపసంహరింపబడతాయి. సృష్టి నా చూపు; లయం నా కనుమూత. అనంతమైన కాలగర్భంలో బ్రహ్మాదుల కాలం, లయకాలం, అజాండకోటులు నాలో అణుస్వరూపాలు. నాకు ఆద్యంతాలు లేవు. నేను లేని ప్రదేశం జగత్తులో అణుమాత్రం లేదు. జగత్తులో ఉన్న వస్తువులన్నీ నా రూపాలే. నన్ను పరమయోగులు పరబ్రహ్మమంటారు; శాక్తేయులు శక్తి అంటారు; వైష్ణవులు విష్ణువు; శైవులు శివుడు; గాణాపత్యులు గణపతి; సౌరమతస్తులు ఆదిత్యుడుగ అనేకరూపాలలో ఉపాసిస్తారు, ధ్యానిస్తారు, పూజిస్తారు. వారివారి శక్తిననుసరించి బుద్ధిననుసరించి నన్నారాధించి తరిస్తారు. నాకు రూపం లేదు, నామం లేదు. నేను స్త్రీని కాను, పురుషుడను కాను, నపుంసకుడను కాను. నాకు నియతమైన రూపమేదీ లేదు, అన్నిరూపాలూ నావే. అన్ని నామాలూ నావే. ఎవరు ఎలా భావిస్తే అలా కనిపిస్తాను. అవన్నీ కల్పిత రూపాలే. నా స్వరూపాన్ని నిర్ణయించలేక వేదాలు అంతాలయ్యాయి. నా రూపాన్ని నిర్వచించలేక శాస్త్రాలు పరస్పర విరుద్ధంగా వాదించుకుంటున్నాయి. సజాతీయ, విజాతీయ, స్వగతభేదశూన్యమైన పరం కంటె పరమైన వస్తువును నేనే. మీకు ఆసురీశక్తి, దేవతలకు గల దైవీశక్తి నేనే. బ్రహ్మాండాలు నాకు బొమ్మరిండ్లు, బ్రహ్మాదులు బొమ్మలు. నేనే బ్రాహ్మీశక్తిగ సృజిస్తాను, వైష్ణవీశక్తిగ పాలిస్తాను, మాహేశ్వరీశక్తిగ సంహరిస్తాను. నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంటే నాలో ఐక్యమై జీవభేదం వదలి అనంతుడౌతాడు జీవుడు. అంతవరకూ సంసారచక్రంలో పడి దేవ, తిర్యక్, మానవాది జన్మలెత్తుతూ తిరుగులాడుతూ ఉంటాడు. సృష్టికి పూర్వమందు నేనేకాకినిగానే ఉన్నాను. పరమందూ ఏకాకినే. సృష్టికాలంలో ఏకాకినై కూడా అనంతకోటి రూపాలతో భాసిస్తాను. నన్నర్ధం చేసుకోలేక భేదవాదులు బాధపడుతూ ఉంటారు. నేను చిచ్ఛక్తిని; నాకు ఆనందమే స్వరూపం; సృష్టిస్థితిలయాల్లో కూడ ఆనందించడమే నా స్వభావము. నాకేగాక నన్ను తలచేవారికి గూడ ఆనందమే గాని విచారముండదు.’’
‘‘నన్ను గుర్తించలేక నా అనుగ్రహంచే కలిగిన బలాన్ని దుర్వినియోగం చేసి, త్రిలోక కంటకుడవై చరించావు. నన్ను గుర్తించిన దేవతలు నన్ను శరణుజొచ్చారు. వారిని రక్షించడానికి నేను అవతరించాను. నేనప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఏకాకినే. యీ బ్రాహ్మీ , మాహేశ్వరీ, వైష్ణవీ ఆది శక్తులన్నీ నా విభూతులే. నీవు చూచుచుండగనే యీ శక్తులన్నీ నాలో లీనమవుతాయి. చూతువు గాక’’ యని సర్వశక్తులనూ తనలో లీనం చేసుకుంది మహామాత.
కన్నులారా చూచాడు శుంభుడు. సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాడు దేవిని. తనలో తానిలా అనుకున్నాడు. ‘‘నా జన్మ సంపూర్ణంగా ధన్యమైంది. సమస్తలోకభోగాలూ అనుభవించాను. లోకంలో ఏకైకవీరుడినని ప్రఖ్యాతి వహించాను. సర్వశక్తులూ సంపాదించాను. త్రిమూర్తులనూ వణికించాను. తుదకు ‘ఉత్క్రాంతిదా’ నామకమైన మృత్యుశక్తిని గూడ స్వాధీనం చేసుకున్నాను. జగన్మాత యవతరిస్తేనే గాని నన్ను జయించేవారు జగత్తులో లేకపోయారు. జీవి జనించాక మరణం తప్పదు. నేను జగన్మాత క్షరనిర్ముక్తమైన దివ్యాస్త్రములచే నామె కనుల ఎదుట ఆమె పాణితీర్థంలో దేహాన్ని చాలిస్తే నా పాపలేశాలు పటాపంచలవుతాయి. నాకిక జన్మ లేదు. నాకీ పాడుదేహంతో ఇక పనిలేదు. పైగా నేను దేవద్వేషిని. సమస్తలోకభయంకరుడను. నావలన ప్రపంచానికి ఇంతవరకూ ప్రయోజనం కలుగలేదు. ఐననూ నా తుదియవస్థలో నాకొరకై దేవి యవతరించుటచే నా మరణరూపమైన ‘అంబికావిజయం’ జగద్వ్యాప్తమై లోకకళ్యాణకారి కాగలదు. గాన నేను యుద్ధం విరమించడం శ్రేయోదాయకం కాదు. అంతేగాక వీరలక్షణం కూడ గాదు. వీరులకు జయమో పరాజయమో రణరంగంలోనే తేలాలి గాని రణభూమి నుండి వెనుదిరగరాదు. అందును ఏకైక వీరుడనగు నాకు తగనే తగదనుకున్నాడు. దుర్గనెదురించాడు.
అటు దుర్గ, ఇటు శుంభుడు. ఆమె మహామాయాశక్తి, ఇతడు మహామాయావి. దుర్గ అనంతశక్తి, శుంభుడ నంతబలుడు. ఆమె యద్వయురాలగుట నిర్భయురాలు, శుంభుడు బలదర్పితుండగుట భయరహితుడు. దుర్గాశుంభులు కదనం ప్రారంభించారు. ఇది కడసారి యుద్ధం. శుంభుడు సర్వప్రయత్నాలూ చేస్తున్నాడు. దేవి హుంకారంతో ధనుష్టంకారం మేళవించింది. సింహం గర్జిస్తోంది. దిశలు పిక్కటిల్లుతున్నాయి. ధనుష్టంకార ధ్వనిచే దిగంతాలు మారుమ్రోగుతున్నాయి. కాంచనరథాన్నధిరోహించి యుద్ధం చేస్తున్నాడు. దేవీశుంభుల యుద్ధం బ్రహ్మాదులు అపూర్వంగా చూస్తున్నారు. దేవి శక్త్యస్త్రం ప్రయోగిస్తే శక్త్యస్త్రంతోనే ఉపసంహరిస్తున్నాడు శుంభుడు. శుంభుని శూలం శూలంతోనే రూపుమాపుతోంది దేవి. ఇరువురూ ప్రయోగించు అస్త్రప్రత్యస్త్రములనుండి బయలువెడలిన మంటలు ప్రళయాగ్నికి మారుగా కనుపిస్తున్నాయి. వారుణ, పర్వత, నాగాది అస్త్రములు స్వస్వరూపాలతో గోచరిస్తూన్నాయి. చూపరులు జయాపజయ నిర్ణయం చెయ్యలేక పోతూన్నారు. శక్తి తోమర భిండివాల పరశు పట్టిస పరిఘ గదా పాశ శూలాద్యాయుధాలు శుంభుడు ప్రయోగిస్తుంటే సర్వాయుధాలూ నిర్మూలనం చేసింది దుర్గతినాశని దుర్గ. ధనుర్బాణాలు ధరించి యుద్ధం ప్రారంభించాడు. ధనస్సు నరికివేసింది. బాణములు, బాణాసనము తుత్తునియలైపోయాయి. రథసారధులతో అశ్వాల్ని హతం చేసింది. వెంటనే ముద్గరమనే ఆయుధాన్ని గ్రహించి దేవిపైకురికాడు. క్షణకాలంలో ముద్గరాన్ని తుత్తునియలు చేసింది. సర్వాయుధాలు వృధా అయిపోయాయి. మల్లయుద్ధం ప్రారంభించాడు అసురుడు.
ముష్టియుద్ధంలో అంబ వక్షస్థలంలో ముష్టిప్రహారం చేసాడసురుడు. దేవి రక్కసుని హృదయంపై తీవ్రముగ ముష్టిప్రహారం చేసింది. దేవి ముష్టిఘాతంచే మూర్ఛిల్లాడు శుంభుడు. క్షణకాలంలో మూర్ఛనుండి లేచి అంతరాళానికెగిరాడు. దేవి కూడ అంతరిక్షానికెగిరింది. బాహాబాహి ముష్టాముష్టి యుద్ధం ప్రారంభించారు. సిద్ధ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాది దేవగణాలు, మహర్షులు, అంబికాశుంభుల ముష్టియుద్ధం చూచి విస్మితులైనారు. తుదకు చండిక శుంభుని బలాత్కారంగా బట్టి భూమిపై విసరికొట్టింది. శేషుడు శిరస్సులు వంచాడు. గాని శుంభుడు తిరిగి అంబపైకురికాడు. తనపైకురుకు శుంభుని బలాత్కారంగా లాగి శూలంతో హృదయమర్మం భేదించింది. అంబ శూలాఘాతంతో క్రూర రాక్షసుడగు శుంభుడు ‘హా హా’ రవం చేస్తూ సముద్రములు, ద్వీపములు, పర్వతములతో కూడ సమస్త భూమండలాన్నీ కంపింపచేస్తూ భూమిపై వ్రాలాడు. ప్రాణములు అనంతవాయువులలో కలిసాయి. వాని చైతన్యము మహాచైతన్యములో ఐక్యమైంది.
శుంభుని మరణంతో జగత్తంతయూ ఆనందనిమగ్నమైంది. తొలుత జగద్విపత్కారమై ఉల్కాపాతములతో గగనాన్నావరించిన కాలమేఘం విడిపోయి ఆకాశం నిర్మలమైంది. నదులు సక్రమంగా ప్రవహిస్తున్నాయి. శుంభ మరణానంతరం దేవతలందరి హృదయాలూ ఆనందంచే నిండిపోయాయి. గంధర్వులు గానం చేసారు, కిన్నరులు పాడారు, అచ్చరలు నృత్యం చేసాఅరు. దేవదుందుభుల మ్రోతతో పువ్వులవాన కురిసింది. మలయానిలుడు మలయ పర్వతం మీదుగ చల్లని మెల్లని గాలి వీచాడు. సమస్త దేవతలూ అంబికా విజయాన్ని గానం చేసారు. అగ్నిహోత్ర శాలలయందు అగ్ని తనంత తానే ధూమరహితంగా జ్వలించింది. లోకానికి భయంకర శబ్దాలు నశించి మంగళమై ప్రశాంతమైన శబ్దాలు జనించాయి. బ్రహ్మాది దేవతలు ‘అంబికకు జై జై జై’ యని నినాదాలు చేసారు. అంబ సమస్త లోకాలకూ కరుణారసదృష్టులు ప్రసరింపజేసింది. సర్వమంగళ సహాయం వల్ల సర్వమంగళాలూ చేకూరాయి జగానికి. అంతా ఆనందం, మంగళం, సుఖం, శాంతం. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.
::: ఉపసంహారము :::
అంబికా విజయం వినడం వల్ల సమాధిసురధులకు సంపూర్ణంగా జగన్మాతయందు భక్తి కుదిరింది. మనస్సునందు కల అధైర్యం నశించింది. మనస్థైర్యం కలిగి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపురాలైన మహామాతను పూజించి ధ్యానిస్తే సమస్త క్లేశాలూ పోతాయని దృఢమైన విశ్వాసం కలిగింది. మహాశక్తి వినా అన్యం శరణ్యం కాదనుకున్నారు. మహర్షిని ప్రార్థించారు. మేధాఋషి వారి దృఢసంకల్పాన్ని గుర్తించాడు. ఉపాసనాక్రమం బోధించాడు. అర్చనా విధానం చెప్పాడు. తన ఆశ్రమంలోనే వారిచేత దీక్ష చేయించాడు. వారు కూడ నిరూఢమైన విశ్వాసంతో అంబనారాధించారు. ప్రసన్నవదనంతో అంబ ప్రత్యక్షమైంది. వరం కోరుకోమంది. సురథునకు జగన్మాత ప్రసన్నురాలైనా విరాగం కలగలేదు. రాజ్యాదులయందు కాంక్ష వదలలేదు. తిరిగి తన పూర్వపు స్థితియు రాజ్యభోగాలు కావాలని వరం కోరాడు. అలాగే అగుగాక యని అంబ వరమిచ్చింది. ఇహలోకంలో సమస్తభోగాలూ అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందుతాడని వరమిచ్చింది. సమాధి మాత్రం బ్రహ్మవిద్యా స్వరూపిణి యగు మహామాత సందర్శనంచే విరాగియై సంసారసముద్రాన్నుండి తరింపజేయమని వరం కోరాడు. అంబ జ్ఞానాన్ని ప్రసాదించగా అజ్ఞానం పటాపంచలైంది. స్వస్వరూప సంధానం కలిగింది. నిరతిశయానందంతో స్వేచ్ఛామయుడైనాడు. జగన్మిధ్య బ్రహ్మసత్యం అనుభవానికి వచ్చింది. అంబికావిజయం విజయరూపంగా మంగళాంతముగా ఉపసంహారమయినది. పఠన శ్రవణాదులచే అంబకు భక్తుడై ఇహ పర సుఖాలను పొందుతాడను మంగళాశాసనంతో సర్వం సమాప్తమయినది.
లోకాస్సమస్తాః సుఖినోభవన్తు.
అంబకు అంబాభక్తులకు జయము కల్గుగాక.