క్రోధి నామ సంవత్సర శరన్నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు.
అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి కనకదుర్గాదేవి అధిష్ఠాన దేవత. శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ పసుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ, ఎరుపు రంగుల చీరలు ధరించి భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహించే శక్తి స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరి.
చెఱకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ శ్రీ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరీదేవిని దర్శించి అర్చించడం వలన సర్వశుభములూ కలుగును. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజితాదేవిగా చల్లనితల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరీ అలంకారంలో దర్శనం ఇస్తుంది.
శరన్నవరాత్రులు పూర్తయిపోయిన మరునాడు అనగా ఇవాళ విజయదశమి వేడుక జరుపుకొంటూ అమ్మవారి వైభవాన్ని కీర్తించుకోవడంతో దసరా పర్వదినం ముగుస్తుంది. ఆ సందర్భంగా ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీకనకదుర్గాదేవి, శ్రీ మల్లేశ్వరస్వామివార్లకు కృష్ణానదిలో హంసవాహనసేవ నిర్వహిస్తారు. చూడముచ్చటైన ఆ జలవిహార వేడుకను తిలకించడానికి భక్తులు ఉవ్విళ్ళూరుతారు తెప్పోత్సవంగా పిలిచే హంసవాహనసేవలో త్రిలోకసంచారానికి గుర్తుగా శ్రీ గంగా సమేత శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్లను మూడుసార్లుగా జలవిహారము గావిస్తారు.