జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో మరో పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలకపార్టీగా అవతరించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఓ లేఖ అందజేసింది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి విజయం సాధించింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ గెలిచింది. ఆ పార్టీ తరుపున పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్, బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యం సాధించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువ సీట్లు ఎన్సీకి వచ్చాయి. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీకి సొంతంగా 29 సీట్లు వచ్చాయి. పీడీపీ మూడు స్థానాలకు పరిమితం కాగా, 10 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.