ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ, రాజకీయ సంక్షోభాల కారణంగా దక్షిణాసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యురేషియా, వెస్ట్ ఏషియా దేశాల్లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. లావోస్‌లో జరుగుతున్న 19వ ఈస్ట్ ఏషియా సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధని మోదీ, యుద్ధ క్షేత్రాల నుంచి సమస్యలకు పరిష్కారాలు దొరకవన్నారు.
దక్షిణాసియా చైనా ప్రాబల్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ విధానాలతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఉద్ఘాటించారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, స్థిరత్వంతోనే ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి ఉంటుందన్నారు. అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాలని, విస్తరణపై కాదని వివరించారు.
మయన్మార్‌లో పరిస్థితిపై ఏషియాన్ వైఖరికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతిని కోరుకునే దేశంగా, సైబర్, సముద్ర, అంతరిక్ష రంగాల్లో కూడా పరస్పర సహకారం బలోపేతం కావాలన్నారు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. .
యాగీ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని మోదీ, క్లిష్ట సమయంలో, ఆపరేషన్ సద్భావ్ ద్వారా మానవతా సహాయం అందించామన్నారు. తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా న్యూజీలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.