జపాన్‌కు చెందిన నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం -2024 దక్కింది. హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడి బాధితుల కోసం నిహన్ హిడంక్యో సంస్థ పనిచేస్తోంది. నిహన్ హిడంక్యోను హిబకుషా అని కూడా పిలుస్తారు.
అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని హిడంక్యో కోరుకుంటున్నట్లు నార్వేయన్ నోబెల్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. న్యూక్లియర్ ఆయుధాలను మళ్ళీ వాడరాదంటూ ఆ సంస్థ ప్రత్యక్ష బాధితులతో ప్రదర్శనలు ఇప్పించిన విషయాన్ని అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ ప్రస్తావించింది.
తమ అవార్డుతో హిరోషిమా, నాగసాకి అణుబాంబు బాధితులను గౌరవిస్తున్నామని నార్వేయన్ నోబెల్ కమిటీ తెలిపింది. భౌతికపరమైన సమస్యలు, జ్ఞాపకాలు వేధిస్తున్నా జపాన్ సంస్థ తమ అనుభవంతో ప్రజల్లో ఆశ, శాంతిని పెంపొదిస్తుందని నోబెల్ కమిటీ పేర్కొంది.
నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు . వ్యక్తులతో పాటు సంస్థలను కూడా నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఇరాన్ సామాజిక కార్యకర్త నర్గెస్ మొహమ్మదీకి గత ఏడాది ఈ అవార్డు దక్కింది. మహిళల హక్కులు, ప్రజాస్వామ్యం గురించి పోరాడినందుకు గాను అవార్డు ప్రకటించారు.
శాంతి బహుమతిని ఓస్లాలో ప్రకటించగా, మిగితా పురస్కారాలను స్టాక్‌హోమ్‌లో వెల్లడిస్తారు. సోమవారం ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతను ప్రకటించడంతో అవార్డుల ప్రకటన ముగియనుంది.