టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూయడంతో ఆ స్థానంలో నోయెల్ టాటా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన ట్రస్ట్ బోర్డుల సభ్యుల సమావేశంలో ఈ ఈ నిర్ణయం తీసుకున్నారు.
టాటా సన్స్ ఆధ్వర్యంలో టాటా గ్రూప్ నడుస్తోంది. ఈ గ్రూపులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్ట్ లు ఉన్నాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ లకు ఎక్కువ వాటాలు ఉన్నాయి. కంపెనీలో దాదాపు 52 శాతం వాటా ఈ రెండింటికి ఉంది. ఐదు ట్రస్ట్‌లకు కలిపి టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీలో మొత్తం 67శాతం వాటా ఉంది. రతన్ టాటా చనిపోయే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా వ్యవహరించారు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ చైర్మన్‌గా, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో చైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులయ్యారు.
నోయెల్ టాటా, రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు నోయెల్ చైర్మన్‌గా ఉన్నారు.
రతన్ టాటా తమ్ముడైన జిమ్మీ , కుటుంబ వ్యాపారాల్లో జోక్యం చేసుకోరు. ఆయన దక్షిణ ముంబైలోని ఓ డబుల్ బెడ్ రూమ్ అపార్టమెంట్ లో నివాసం ఉంటున్నారు. రతన్ టాటా 1937లో పార్సీ కుటుంబలో జన్మించారు. అయితే ఆయనకు పదేళ్లు వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగారు.