హైదరాబాద్ లో ఘోర అపచారం జరిగింది. నవరాత్రుల కోసం ప్రతిష్టించిన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి ఘోర అపచారానికి పాల్పడ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గురువారం నాడు అర్ధరాత్రి సమయంలో దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్న హిందూ సంఘాల నేతలు, భక్తులు అక్కడకు చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ పోలీసులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుని కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి సమయంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోకి ప్రవేశించిన దుండగులు, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలను పగలగొట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చేతిని విరగ్గొట్టి, అక్కడున్న పూజ సామగ్రిని పడవేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బ్యారికేడ్లను కూడా నెట్టివేశారు.