దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శరన్నవరాత్రులు నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదోజైన గురువారం సాయంత్రం దుర్గాష్టమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారు మహాగౌరిగా దర్శనమిచ్చారు. నంది వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. నవదుర్గా రూపాల్లో ఎనిమిదో రూపంగా ఈ అమ్మవారు ఉంటారు. చేతుల్లో వర, అభయ ముద్రలు, త్రిశూలం, ఢమరుకాన్ని ఆయుధాలుగా ధరించి దర్శనమిస్తారు. తెల్లనిరంగులో శాంతస్వరూపిణిగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
నవదుర్గలలో మహాగౌరి రూపం అంత్యంత శాంతమూర్తిగా పురాణాల్లో పేర్కొన్నారు. ఈ తల్లి తెల్లని వృషభాన్ని వాహనంగా కలిగిఉంటుంది. ఈ దేవిని పూజించడంతో పాపాలన్నీ నశించి కష్టాలు తొలిగిపోతాయి.
నవరాత్రుల సందర్భంగా శ్రీగిరిలో ప్రతీరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భజనలు, డోలు వాయిద్యాలతో ఆదిదంపతులను సేవిస్తున్నారు.
నవదుర్గా రూపాల్లో ఆఖరి రూపంగా నేడు శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనం ఇవ్వనున్నారు. స్వామి, అమ్మవార్లు ఈరోజు సాయంత్రం అశ్వవాహనంపై విహరించి భక్తులను కటాక్షిస్తారు.
దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి బీసీ జనార్థనరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొంటారు.