ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు తీయించేందుకు రూ.2807 కోట్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏపీ అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం అందించింది. గతంలోనే పూర్తి చేసిన పనులకు రూ.400 కోట్లు, చేయబోయే పనులకు అడ్వాన్సుగా కేంద్ర ఆర్థిక శాఖ కంటింజెన్సీ ఫండ్ నుంచి రూ.2348 కోట్లు విడుదల చేసింది. మొత్తం మీద ఏపీకి రూ.2807 కోట్లు విడుదల చేశారు.
పోలవరం నిధుల ఖర్చు విషయంలో కేంద్రం షరతులు విధించింది. 75 శాతం నిధులు ఖర్చు చేసి, వాటి లెక్కులు ఆడిట్ చేసిన తరవాతే మిగిలిన నిధులు విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, జలసంఘం నిర్దేశించిన పనులు చేయాలని షరతు విధించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పనుల పురోగతిపై అథారిటీకి నివేదికలు సమర్పించాలని షరతుల్లో పేర్కొన్నారు.
డిసెంబరు నుంచి పోలవరం పనులు పరుగులు తీయనున్నాయి. కేంద్ర జలసంఘం సూచనల మేరకు పనులు చేపట్టనున్నారు. రాక్ ఫిల్ డ్యాం, డయా ఫ్రం వాల్ నిర్మాణాలతోపాటు నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించనున్నారు. 2026 డిసెంబరు నాటికి పోలవరం మొదటి దశ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.