ఏపీకి తుపాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఈ నెల 12 నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అది తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం నైరుతి దిశగా పయనించి, తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఏపీలో తీరం దాటే అవకాశముందని తెలుస్తోంది.
అల్పపీడనం, తుపాను ప్రభావంతో ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, సత్యసాయి, ఎన్టీఆర్, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో 1 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం నాటికి తుపాను విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.