తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారికి మహా రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు గోవిందా అంటూ రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు.
ఇవాళ సాయంత్రం స్వామి వారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నారు. నేటితో శ్రీవారికి వాహన సేవలు ముగియనున్నాయి. రేపు చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముగింపు ఉత్సవాలకు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనం 12 గంటలు పడుతోంది. ఇప్పటికే 26 కంపార్టుమెంట్లు నిండిపోయి, క్యూలైన్లు బయటకు వచ్చాయి. గురువారం స్వామివారిని 61 వేల మంది దర్శించుకున్నారు. 26 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారికి గురువారంనాడు రూ.3.88 కోట్ల ఆదాయం లభించింది.