***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
మునిపుంగవుడిలా ధ్యానిస్తున్నాడు. బంధూకపుష్పము మరియు సువర్ణంతో సమానమైన వర్ణం కలిగి (అంటే రక్త పీత మిశ్రితమైన వర్ణము) తన హస్తములయందు అక్షమాల, పాశము, అంకుశము, వరదముద్రను ధరించి శిరమున అర్ధచంద్రుని భూషణముగా ధరించిన ‘శ్రీ’విగ్రహరూపమైన అర్ధనారీశ్వరమూర్తి నా హృత్పద్మమున వసించుగాక.
మహర్షి ధ్యానం పూర్తికాగానే మహారాజు ఋషికి నమస్కరించి ఇలా అడిగాడు, ‘గురువరా! రక్తబీజ వధానంతరం శుంభనిశుంభులు ఏఏ కృత్యాలు చేసారు? దేవి ఏఏ కృత్యాలు చేసింది? వీరిరువురు గాక మిగిలిన మహారాక్షస వీరులంతా మరణించారు గదా! బ్రాహ్మీ మాహేశ్వరీ వైష్ణవీ ఇంద్రాణ్యాది శక్తులన్నీ ఆ రంగంలో తుదివరకూ ఉన్నాయా? లేక అంతర్థానమయ్యాయా! ముందు కథావృత్తాంతము సవిస్తరముగా చెప్పుడు’ అని ప్రార్థించాడు.
ఋషి కథాప్రారంభం చేసాడు. ఓ మహారాజా! రక్తబీజ సహితంగా సమస్త సైన్యాలు సైన్యాధిపతులు హతులైన తోడనే శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులవలె క్రోధావేశపరవశులై తమతమ మూలబలాల్ని ఆయత్తపరచారు. శుంభనిశుంభులు సర్వమూలసైన్యాలనూ లేవదీసారు. యీసారి దేవీమాయను ఆసురీమాయ జయించాలి లేదా ఆసురీమాయ నాశనమైపోవాలి అనుకున్నారు. మహాభీషణమైన కోలాహలం బయలుదేరింది. భైరవనినాదం చేస్తున్నాడు నిశుంభుడు. నిశుంభుని నినాదాన్ని ధిక్కరిస్తోంది శుంభుని సింహనాదం. శుంభనిశుంభుల మూలబలాలు రణోత్సాహంతో ముందుకురుకుతున్నాయి. రథనేమి నిస్వనాలు, ఏనుగుల ఘీంకారాలు, గుర్రముల సకిలింపులు, పదాతుల సింహనాదాలు, యోధుల ధనుష్ఠంకారాలు, వీరుల సింహనాదాలతో మహాఘోరభీకరమైన శబ్దం బయలుదేరింది.
దిగంతములు వ్యాపించే ఆ శబ్దం వింది జగదంబ. సింహం గర్జించింది. మాతృగణాలు మహామాత చుట్టును జేరి హుంకారం ప్రారంభించాయి. చండిక, చాముండ వికటాట్టహాసాలు చేస్తున్నారు. బ్రాహ్మీ మాహేశ్వరీ వైష్ణవీ కౌమార్యాది దేవతాశక్తులు తమతమ వాహనాలనధిరోహించి ఆయుధాలను ధరించి యుద్ధాభిముఖులై అంబను సమీపించారు. మహాసరస్వతి సింహనాదం చేసింది. ధనుష్ఠంకారం గావించింది. శబ్దాధిష్ఠానమగు దేవి సింహనాదం వల్ల బ్రహ్మాదుల శ్రవణపుటాలు గింగురుపోతున్నాయి. ధనుష్ఠంకారం వల్ల సహస్రవదనుని శిరములతో భూమి చలిస్తూంది. కులపర్వతాలు ఊగుతున్నాయి. సముద్రాలు కట్టలుదాటి భూమిని ఆక్రమిస్తున్నాయి.
రాక్షసులు నిర్భయంగా ముందుకొచ్చారు. భీషణంగా సమరం ప్రారంభమైంది. అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు రాక్షసులు. మహాచండిక భీషణ కరవాలంతో రాక్షసులను ఖండిస్తూంది. మహాకాళి రాక్షసుల కంఠనాళాల్లోనుండి ప్రవహించు రక్తాన్ని కపాలపాత్రతో పానం చేస్తూంది. మాంస మేదో మజ్జా ప్రియులగు యోగినీశక్తులు ఆయాభాగాలను భక్షిస్తున్నారు. ప్రేవులు, అస్థులు తమతమవైపు లాక్కుంటున్నాయి కాక కంగ గృధ్ర జంబుకాదులు. కాళరాత్రి నృత్యం చేస్తోంది. మృత్యుదేవత రాక్షసుల శిరస్సులయందు తాండవిస్తోంది. మాతృకాగణాలు స్వేచ్ఛావిహారం చేస్తున్నాయి. అంబశక్తులకు దొరకిన రాక్షసులకు జీవితాశ లేదు. రక్తపుటేరులు పారుతున్నాయి. గజశిరస్సులు రక్తప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ప్రవాహానికి ఏనుగుల మొండెములు రాక్షసుల కళేబరాలు ఆనకట్టలవుతున్నాయి. మహావీరులగు రాక్షసులు, మహాతేజోమూర్తులైన శక్తిగణాలు ప్రయోగించే బాణవృష్టి సూర్యకాంతిని నిరోధించే ప్రళయ వర్షాన్ని గుర్తింపచేస్తూంది. పరస్పర గదాఘాతములచే అగ్నికణాలు రాలుతున్నాయి. ఆ శబ్దము పిడుగులు పడుతోన్నట్లుంది. ఒకమూల వైష్ణవీదేవి ప్రయోగించిన సుదర్శనం ప్రళయాగ్ని చిమ్ముతూ రాక్షస కంఠనాళాలు ఉత్తరిస్తూంది. మాహేశ్వరీ శక్తిశూలం రాక్షసుల హృత్పద్మాలను భేదిస్తూంది. బ్రహ్మాణీ కమండలం రాక్షసులను శాశ్వతనిద్రబుచ్చుతోంది. అట్లే ఇంద్రాణీ, కౌమారీ మొదలగు సర్వశక్తులూ రాక్షససైన్యాలను రూపుమాపాయి.
శుంభనిశుంభులు వినా మిగిలిన సర్వరాక్షససైన్యాలూ నశించిపోయాయి. నిశుంభుని క్రోధానలం జ్వలించింది. కండ్లెర్రవారాయి. తమ శక్తిని ఒకసారి స్మరించుకున్నాడు. అంబ శక్తిని పరిశీలించి చూచాడు; ఆలోచించాడు. అపూర్వ తేజశ్శాలియగు అంబ జగన్మాతయని గ్రహించాడు. జయమా! పరాజయమా! నేడు తేలిపోవాలనుకున్నాడు. జయిస్తే సర్వాధిపత్యం; మరణిస్తే చిచ్ఛక్తిలో ఐక్యం. ఎటైనా మేలే అనుకున్నాడు. ముందుకొచ్చాడు. సర్వశక్తులూ ఆయుధ ప్రయోగాలు చేస్తుంటే పర్వతం మీద వాన కురిసినట్లే నిష్ఫలమౌతున్నాయి. శస్త్రాస్త్రాలు, బ్రాహ్మీ మాహేశ్వరీ వైష్ణవ్యాది సర్వశక్తులూ కూడ నిశుంభుని పరాక్రమానికి తాళలేకపోతున్నారు.
సమస్త దేవతాశక్తుల్నీ నిరాకరిస్తున్నాడు నిశుంభుడు. వైష్ణవీ చక్రాన్ని ఎదిరి చేత్తో విసిరేస్తున్నాడు. మాహేశ్వరీ శూలాన్ని తృణీకరిస్తున్నాడు. బ్రహ్మాణీదేవి కమండలోదకం నిశుంభునకభిషేకజలంగా పరిణమిస్తోంది. వజ్రం వానివద్ద పదునులేనిదైపోయింది. ఇదేరీతి సర్వవిధములైన దేవీశక్తులను నిరాకరించేసాడు. శాంబరీమాయను లేవదీసాడు. చక్రానికి చక్రం, శూలానికి శూలం, వజ్రానికి వజ్రం, శక్తికి శక్తి ఉపయోగిస్తున్నాడు. అనంతమైన యోగినీగణాల కందరకన్నిరూపులై యుద్ధం చేస్తున్నాడు. నిశుంభుని మహాశాంబరీ మాయాయుద్ధం చూచింది దేవి. ఆనందించింది. మహాపరాక్రమశాలి, మాయాయుద్ధవిశారదుడు, వీరుడు, శూరుడు అని మెచ్చుకుంది. ఎంత బలశాలి యైనను, ఎంత మాయావియైనను నన్ను గ్రహించలేకపోయాడనుకుంది. ముందుకొచ్చింది. మాతృకాది గణాలకు ఉత్సాహాన్ని పురిగొల్పింది.
అంబ తనపై యుద్ధానికి రావడం గమనించాడు నిశుంభుడు. అంబతో సమానమైన ఆకారాన్ని ధరించాడు. అన్నిచేతుల అన్నిఆయుధాలు గ్రహించాడు. యుద్ధం మొదలుపెట్టాడు. నిశుంభ అంబల యొక్క ద్వంద్వయుద్ధం దేవతలకే అచ్చెరువు కలిగిస్తోంది. జగన్మాత నిశుంభుని రథ సారధులతో అశ్వాల్ని గూల్చింది. నిశుంభుడు విరథుడై శూలఖడ్గాదులతో దేవివాహనమగు సింహాన్ని గాయపరచాడు. ఆ వ్రేటుకు సింహం గర్జించి గంతు వేసింది. అంబ తీవ్రరూపం దాల్చింది.
నిశుంభా! నా వాహనము నింతవరకు గాయపరచినవారు లేరు. నీవు వీరుడగుట నిశ్చయము. గాని తమోగుణప్రధానమైన బుద్ధిచే నన్ను గుర్తింపలేకపోతివి. నేటితో నా అనంతకోటి నామాలలో నిశుంభమర్దినీ నామం చేరుతుంది. నీకు కాలం సమీపించింది. పదునాలుగు భువనము లేకమైనను నీకిక జీవితాశ లేదు. కడసారి నీ ఇష్టదేవతను ప్రార్థించుకొనుము. మా మహాకాళికి నిన్ను బలియిచ్చెదను అని పలుకుచు హుంకరించుచు ఘోరాకారిణియై నిశుంభుని సంహరింప వానిపైకురికెను. అంత చండిక మహాక్రోధంతో త్రిశూలాయుధముచే వాని హృదయకవాటము భేదించెను. తోడనే హృత్పద్మము నుండి శోణితము ప్రవాహరూపంగా బయలుదేరింది. నిశుంభుడు మూర్ఛచెందాడు. మహాకాళి పాతాళజలం వలె ప్రవహించు నా శోణితాన్ని ఆనందంగా పానంచేస్తూంది. క్షణకాలంలో మూర్ఛనుండి లేచాడు. వేయిబాహువులు ధరించాడు. సింహాన్ని, కాళికను శూలంతో గాయపరిచాడు. అనేక శస్త్రాలతో చండికను కప్పివేసాడు.
సమస్త దుర్గమ దుఃఖాలనూ నశింపజేసే దుర్గ, కాళీ చండికల యవస్థ చూచింది. మహాశూలాన్ని ప్రయోగించింది. హృదయమర్మం భేదించుకుపోయిందా శూలం. నిశుంభుడు నేలగూలాడు. వానిలోనుండి మరొక పురుషుడు లేచి ‘దుర్గా! నిలునిలు’మన్నాడు. దుర్గ కరవాలంతో వాని శిరము ద్రుంచి సింహనాదం చేసింది. నిశుంభుని ప్రాణాలు దేహాన్ని వదిలాయి. వాని చేతన మహాచైతన్యంలో కలసింది. సింహం, కాళి, శివదూతి, చండిక మొదలగు దేవీశక్తులు రాక్షసుల మాంసాన్ని నములుతున్నాయి. రక్తపానం చేస్తున్నాయి. పువ్వులవాన గురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. బ్రహ్మాదులు అంబికావిజయాన్ని కీర్తించారు. సమస్తలోకాలూ ఆనందించాయి.