బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హిందువులు భగవంతుడిగా ఆరాధించే హనుమంతుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆ విషయం తెలిసిన విద్యార్ధుల తల్లిదండ్రులు బుధవారం (అక్టోబర్ 9) ఉదయం పాఠశాల ఆవరణలో నిరసన చేపట్టారు.
బెగుసరాయ్ జిల్లా బఛ్‌వాడా బ్లాక్‌లోని హర్పూర్-కాదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జియావుద్దీన్ అనే వ్యక్తి ఆ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్, వ్యాకరణం నేర్పించే ఉపాధ్యాయుడు. అక్టోబర్ 8, మంగళవారం నాడు అతను పిల్లలకు పాఠం చెబుతూ ‘భగవాన్ హనుమంతుడు కులం రీత్యా ముస్లిం, ప్రతీరోజూ నమాజ్ చేసేవాడు’ అని చెప్పాడు. అంతేకాదు, ‘హనుమంతుడికి నమాజ్ చేయమని చెప్పింది స్వయంగా భగవాన్ రాముడే’ అని కూడా చెప్పాడు.
పిల్లల ద్వారా ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల ఆగ్రహానికి అంతే లేకుండా పోయింది. బుధవారం ఉదయమే చాలామంది తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులను వెంటపెట్టుకుని పాఠశాలకు వెళ్ళారు. అక్కడ జియావుద్దీన్ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హనుమంతుడి గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ పట్టుపట్టారు. అతన్ని పాఠశాల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆ ఉపాధ్యాయుడు క్షమాపణలు చెప్పాడు.
ఆ సంఘటన గురించి బిహార్‌కు చెందిన కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ గిరిరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఇది సమాజంలో మతసామరస్యానికి విఘాతం కలిగించడానికి చేసిన కుట్ర అని, ఆ వ్యాఖ్యలు చేసిన జియావుద్దీన్ మీద తక్షణం చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసారు. అటువంటి ఉపాధ్యాయులు సమాజంలో విద్వేషభావాలను వ్యాపింపజేస్తారనీ, అటువంటి ఉపాధ్యాయులను సమాజం, హిందువులు ఎంతమాత్రం నమ్మబోరనీ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
మరోవైపు, విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్ళారు, జరిగిన సంఘటన గురించి విచారించారు. అయితే విచారణ సమయంలో మాత్రం జియావుద్దీన్ తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ అడ్డం తిరిగాడు. విచారణ తర్వాత విద్యాశాఖ అతనిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.