***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
ముని జగదంబనిలా ధ్యానిస్తున్నాడు: ఏ మహామాత అరుణవర్ణంతో ప్రకాశించుచున్నదో; ఏ జనని కరుణారస ప్రవాహమును వెదజల్లు నేత్రములు కలదో; ఏ లోకమాత పాశము, అంకుశము, ధనుస్సు, బాణము హస్తముల యందు ధరించినదో; అణిమాది సిద్ధిరూపమైన కిరణములచే ఆవృతమైన ఆ భవానిని ధ్యానించుచున్నాను. ధ్యానానంతరం సమాధిసురథులకు చరిత్ర వినిపిస్తున్నాడు.
ఓ కుమారులారా! చండముండులు సర్వసైన్య సమేతంగా నిహతులైన వృత్తాంతం వినిన తోడనే శుంభుని ఆగ్రహానికి మేరలేదు. నేత్రములనుండి అగ్నికణాలు రాలుతున్నాయి. దంతములు కటకట కొరుకుతున్నాడు. సర్వసైన్యాలనూ రావించాడు. సమస్త రాక్షస సైన్యాలతో శుంభనిశుంభులు స్వయంగా యుద్ధానికి బయలుదేరారు. అపార బలురు, అధిక సైన్యాలకు అధిపతులునగు ఉదాయుధ, కాలక, దౌహ్రద, మౌర్య, కాలకేయాది మహావీరులంతా తమతమ సైన్యాలతో హిమాచలాన్ని చేరారు.
సింహవాహనారూఢురాలైన అంబిక చూసింది. అసంఖ్యాక రాక్షస సైన్యాలను, శుంభనిశుంభులు కూడ యుద్ధరంగానికి రావడం గమనించింది. శంఖం పూరించింది. ఘంటానాదం చేస్తోంది. ధనుష్ఠంకారం గావిస్తోంది. సింహం కూడ గర్జన చేయడం ప్రారంభించింది. అటు సింహగర్జన, ఇటు దేవియొక్క శంఖఘంటారవాలు, పైగా సింహనాద ధనుష్ఠంకారంతో దశదిశలా మహాభయంకర శబ్దం బయలుదేరింది.
పదునాలుగు భువనాలు కంపిస్తున్నాయి గాని రాక్షసులు మాత్రం నిర్భయంగానే ఉన్నారు. సింహనాదాలు చేస్తున్నారు. ధనుష్ఠంకారాలు గావిస్తున్నారు. దేవిని నేనొక్కడనే జయిస్తానంటూ రాక్షసులు యుద్ధోన్మత్తులై దేవిని చుట్టుముట్టారు. ఉభయవర్గాల ఘోరశబ్దాలు ఏకీభవించాయి. పదఘట్టనలతో వేయిపడగలవాడు కంపించి పోతున్నాడు.
అంబ ముందుకు వచ్చింది. మహాకాళి బ్రహ్మాండకోటుల నొకమారు కబళిస్తుందా! అన్నట్లు నోరు తెరచింది. వికటాట్టహాసం చేస్తోంది. లోతైన కండ్లు అగ్నిగుండాలవలే ప్రకాశిస్తున్నాయి. మెడలో కపాలమాలిక, హస్తమందలి మహాఖడ్గము సర్వసంహారిణియని చాటుతున్నాయి. లోకాలకు అకాల ప్రళయశంక కలుగుతోంది. అదే సమయంలో త్రిమూర్తుల సహితంగా త్రింశత్కోటి దేవతలు భీషణసంగ్రామ నిరీక్షణాకుతూహలురై గగనచారులై చూస్తున్నారు.
శివుని దేహంలోనుండి బయలుదేరింది మాహేశ్వరీ శక్తి. ఐదుముఖాలతో ఆవిర్భవించింది. వృషభవాహనాన్ని అధిరోహించింది. పినాక శూలాద్యాయుధాలను ధరించింది. అంబ సమీపానికి వచ్చింది. అట్లే వైష్ణవీశక్తి గరుడవాహనారూఢయై శంఖ చక్ర గదా పద్మధారియై వచ్చింది. బ్రాహ్మీ, కౌమారీ, ఇంద్రాణీ, వారాహీ, నారసింహీ మొదలగు సమస్త శక్తులు ఆయాదేవతల నుండి జనించి అనురూప వాహనాద్యాయుధాలతో రంగంలో ప్రవేశించాయి. అటు రాక్షస సైన్యాలు, ఇటు అంబ సైన్యాలూ మోహరించాయి.
అంబ తన దేహంలోనుండి మహాచండికను సృజించి పలికింది: ‘ఓ చండీ! నా ఆనందం కొరకు నీవీ అసుర సైన్యాలను సంపూర్ణంగా సంహరింపు’మని పలికింది. సంహారమే స్వభావంగా గల మహాచండిక కోట్లకొలది నక్కలరుస్తున్నట్లు, రాబందులు, గ్రద్దలు కూస్తున్నట్లు ధ్వనిచెయ్యడం ప్రారంభించింది. అపరాజితాదేవి జటాజూటుడగు శివుని పిలచి ‘‘ఓ సదాశివా! నీవు శుంభుని వద్దకు రాయబారివిగబోయి శుంభనిశుంభులతో నిట్లు పలుకుము: ‘ఓ శుంభనిశుంభులారా! ఓ సమస్త రాక్షసులారా! మీకు జీవితాశ కలదేని మీరందరు పాతాళలోకానికి బొండు. తలలు వంచి మా దేవికి మ్రొక్కుడు. లేదా ముహూర్తకాలంలో మా యోగినీశక్తులు మీ రక్తమాంసాలను కబళిస్తాయి’ యీరీతిగ వారితో చెప్పి వారి యభిప్రాయమును గొనిరమ్మ’’ని పలికెను. తోడనే పరమశివుడు శుంభునిజేరి దేవి పలుకులు వినిపింప శుంభుడుగ్రుడై కాలాగ్నివలె మండిపడుచు సంధియనునది శుంభుడంగీకరింపడని బదులు చెప్పెను. శివునివల్ల ఆ వార్త విని జగదంబ సర్వశక్తులకు రాక్షససంహారాని కనుజ్ఞ ఇచ్చెను.
ఉత్తరక్షణంలో దేవీశక్తులతో రాక్షససైన్యాలకు యుద్ధం ప్రారంభమైంది. మాహేశ్వరి శూలంతో రాక్షససంహారం ప్రారంభించింది. వైష్ణవి సుదర్శనచక్రప్రయోగం చేతను, బ్రహ్మాణీశక్తి కమండలోదకం చేతను, కౌమారి శక్త్యస్త్రంతోను, ఇంద్రాణి వజ్రప్రయోగంతోను ఇదేరీతిగ వారాహీ, నారసింహీ మొదలగు సమస్త శక్తిగణాలు తమతమ ఆయుధాలతో యుద్ధం ప్రారంభించి రాక్షససంహారం చేస్తున్నాయి. రాక్షసులు కూడ వివిధాస్త్రాలతో యుద్ధం చేస్తున్నారు.
జగదంబ ధనుర్బాణాలు ధరించి సర్వసంహారమూర్తియై ప్రళయతాండవం చేస్తూ ఎక్కడ జూచిన తానయై రాక్షసుల సమస్తాయుధాలను త్రుంచివేస్తోంది. అంబ బాణవృష్టిచే అనేకులగు రాక్షసులు మృత్యుముఖంలో పడుతున్నారు. చండిక ప్రచండరూపంలో సంహారకృత్యం మొదలుపెట్టింది. మహాకాళిక సమస్త రాక్షసులనూ కబళించివేస్తోంది. యీరీతిగ సర్వశక్తులూ ఏకమై రాక్షసులను సంహరిస్తూంటే యోగినీగణాలు రక్తమాంసాలు కబళిస్తున్నాయి. మహాభీకరయుద్ధంలో రక్తనదులు ప్రవహిస్తూన్నాయి. అస్థిపర్వతాలు బయలుదేరాయి. భూత బేతాళ పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకినీ గ్రహాలు వికటనృత్యాలు చేస్తున్నాయి. వికట అట్టహాస బీభత్స భయానక రౌద్ర క్రోధాలు మూర్తీభవించి స్వస్వరూపాలతో రంగంలో ఉన్నాయి. సర్వరాక్షససైన్యాలూ హతమైపోతున్నాయి.
అది చూచాడు రక్తబీజాసురుడు. యుద్ధోన్మత్తుడై యుద్ధరంగంలో ముందుకొచ్చాడు. ఇంద్రాణీశక్తి ఎదురించింది. వజ్రం ప్రయోగించింది. వజ్రఘాతముచే రక్తబీజుని దేహం నుండి రక్తము భూమియందు స్రవిస్తోంది. రక్తబిందువు భూమికి తగిలీ తగలడంతో కోటానుకోట్లు రక్తబీజులుద్భవిస్తున్నారు. వానిపేరే రక్తబీజుడు. వాని రక్తం భూమిపై బడితే బిందువుకు కోటి రక్తబీజులు జనిస్తారు. అట్టిశక్తి సాధించాడా రక్కసుడు. అది చూచింది వైష్ణవీశక్తి. చక్రం ప్రయోగించింది. చక్రధారలచే బయలువెడలిన రక్తం నుండి జనిస్తున్నారు రక్తబీజ సమాకారులగు రాక్షసులు. బ్రాహ్మీ కౌమారీ నారసింహీ వారాహీ మొదలగు శక్తులు రక్తబీజవధ కొరకు చేసే ప్రయత్నంలో అతడు మరణించలేదు సరికదా కోటానుకోట్ల రక్తబీజులుద్భవించారు. ఎక్కడ చూచినా రక్తబీజాసురులే. అట్టి అసంఖ్యాకులగు రక్తబీజరూప రాక్షసులను హతం చేస్తున్నాయి దేవిగణాలు. ఎంత ప్రయత్నించినా గణములయొక్క కృత్యం నిష్ఫలమైపోతోంది. సుదర్శనం వానికి సుదర్శనమవుతోంది. శూలం వృధా అయిపోయింది. వజ్రం కుంటువడింది. కాలదండం కూడ ప్రయోజనకారి కాలేదు. సమస్తదేవతాశక్తులూ వానిముందు శక్తిహీనమైపోయాయి.
అది చూచింది మహాసరస్వతి. మహాకాళిని పిలిచింది. ‘ఓ మహాకాళీ! వీడు రక్తబీజుడు. వీనిలో రక్తమున్నంతవరకూ వీనికి చావులేదు. నేను శస్త్రప్రహారం చేస్తాను. నీవు వీని రక్తాన్ని పానం చెయ్యి. వీని రక్తాన్నుండి జనించే రక్తబీజులను కబళించు. నీకు చండిక కూడ సహాయంగా ఉంటుంది.’ ఇలా పలికేసరికి ఒకవైపు చండిక, మరోవైపు చాముండ బయలుదేరారు. భీకరాట్టహాసాలతో రాక్షసుల్ని మ్రింగివేస్తున్నారు. దేవి సమస్తాయుధాలు ప్రయోగిస్తోంది. వానిలోనుండి గంగాప్రవాహంలా బయలుదేరింది రక్తప్రవాహం. మహాప్రీతితో ఆ రక్తాన్ని పానం చేస్తోంది కాళి. ఆ రక్తంలోనుండి జనించే రక్తబీజోద్భవులను దంతములతో నమిలివేస్తోంది. ఒకబిందువు కూడ వృధాపోవుట లేదు. మహాకాయుడగు వాని రక్తాన్నంతనూ పానం చేసింది. ఇంక వాని దేహంలో రక్తం లేదు. మాంసం పీల్చేస్తోంది.
యీరీతిగ జగదంబ చండి, చాముండాది ఘోరశక్తు లొక్కుమ్మడి వానిపైకురికి పీల్చిపిప్పిచేస్తూంటే రక్తబీజాసురుడు నిర్లక్ష్యం చేస్తూ దేవిపైకురికి గదా శూల భిండివాల తోమర పరశు పట్టిఘాది ముప్ఫైరెండు రకాల ఆయుధాల్ని ప్రయోగిస్తున్నాడు. ఆయుధ శక్తులన్నీ జగదంబా స్వరూపాలే యగుట అవన్నియూ జగదంబలో కలుస్తున్నాయి. తుట్టతుదకు శ్రీమహాదేవి సమస్తాయుధాలనూ ప్రయోగించడం మొదలుపెట్టింది. ఆయుధప్రహారమాత్రంచే బయలువెడలిన రక్త మాంస మేదో మజ్జాది ధాతువుల్ని కాళిక పీల్చేస్తూంది. తుదకు రక్తమాంసాలు క్షీణించి మేదో మజ్జాది ధాతువులు కూడ నశించిపోయాయి. ఎముకలు చర్మం గాక ఇక ఏ ధాతువూ లేదు. ఇంతలో శూలంతో వాని శిరమును వేరుచేసింది జగన్మాత. రస రక్త మాంస మేదో అస్థి మజ్జా శూన్యమైన ఆ రక్తబీజుని కపాలం పుఱ్ఱెలమాలలో చేర్చుకుంది. రక్తబీజుడు మరణించాడు.
యీ అపూర్వచర్యలు గల రాక్షస మరణాని కానందించారు దేవతలు. దేవిని స్తుతించారు. రక్తబీజవధారూపమైన అంబికావిజయాన్ని గంధర్వులు గానంచేసారు. మాతృగణాలు రక్కసుల రక్తాన్ని పానం చేసి ఉన్మత్తతతో నృత్యం ప్రారంభించాయి. ఇది రక్తబీజ సంహార రూపమగు అంబికా విజయము.