భారతదేశపు టెక్నాలజీ హబ్ బెంగళూరు నగరంలో తాజాగా మరో లవ్‌జిహాద్ కేసు వెలుగు చూసింది. ప్రేమ పేరుతో హిందూ యువతిని లొంగదీసుకుని, పెళ్ళి చేసుకోవాలంటే మతం మారాలంటూ బలవంతం చేస్తున్న యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు కేరళకు చెందిన బిలాల్ రఫీక్ కాగా బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతి. గోవిందపూర్ స్టేషన్ పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2021లో బిలాల్ రఫీక్ పరిచయమయ్యాడు. తాను మర్చెంట్ నేవీలో పనిచేస్తున్న ఉన్నతాధికారిని అని పరిచయం చేసుకున్నాడు. త్వరలోనే ఆమెను ఆకర్షించి ప్రేమలోకి దించాడు. బిలాల్ రఫీక్ ప్రేమమైకంలో మునిగిపోయిన ఆ యువతి, ఉద్యోగం కోసమంటూ బెంగళూరు చేరుకుంది. 2022లో బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అప్పట్నుంచీ బిలాల్‌తో కలిసి జీవిస్తోంది.
యువతిని ప్రేమ ముసుగులో లొంగదీసుకున్న బిలాల్ ఆమెను లైంగికంగానూ ఉపయోగించుకున్నాడు. ఫలితంగా ఆమె రెండుసార్లు గర్భవతి అయింది. ఆ రెండుసార్లూ కూడా ఏవేవో సాకులు చెప్పి అబార్షన్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేసి ఒప్పించాడు.
ఇటీవల బాధిత యువతి మూడోసారి గర్భవతి అయింది. అయితే ఈసారి అబార్షన్ చేయించుకోడానికి ఆమె నిరాకరించింది. తనను పెళ్ళి చేసుకోమంటూ బిలాల్‌ను కోరింది. దానికి బిలాల్ ఒప్పుకున్నాడు. అయితే ఆమె ఇస్లాంలోకి మతం మారాలని షరతు పెట్టాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దాంతో పెళ్ళి వ్యవహారాన్ని పక్కన పెట్టేసాడు. అయినప్పటికీ పెళ్ళి పనుల పేరిట ఆమె నుంచి రూ.లక్ష, ఒక ఖరీదైన ఫోన్ తీసుకున్నాడు.
ఇస్లాంలోకి మతం మారడం ఇష్టంలేని యువతి, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్ళి చేసుకోడానికి రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. బిలాల్ పెళ్ళిని ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఆమె మతం మారితే తప్ప పెళ్ళి జరగదు అని ఎట్టకేలకు కుండ బద్దలుగొట్టేసాడు. దాంతో ఆ యువతి గోవింద్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా బిలాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.
ఈ సంఘటన కర్ణాటకలో లవ్‌జిహాద్ చర్చను మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది. మహిళలను ప్రేమ ఉచ్చులోకి లాగి, వారిని లైంగికంగా దోచుకుని, చివరికి మతం మారాలంటూ ఒత్తిడి చేయడం ద్వారా లవ్ జిహాద్ కార్యక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి.