జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ తమిళనాడులో ఎన్ఐఎ అరెస్ట్ చేసిన హిజ్బుత్ తహ్రీర్ సభ్యుల సంఖ్య 7కు చేరుకుంది.
హిజ్బ్-ఉత్-తహ్రీర్ సంస్థ భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాపింపజేస్తోంది. వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తోంది. హింసాత్మక జిహాదీ కార్యకలాపాల ద్వారా భారత ప్రభుత్వాన్ని పడగొట్టి ఖిలాఫత్ (ముస్లిం రాజ్యం)గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ కార్యకలాపాలను పసిగట్టిన ఎన్ఐఎ, తమిళనాడులో ఆ సంస్థలో పనిచేస్తున్న సభ్యులను ఇప్పటికి ఏడుగురిని అరెస్ట్ చేసింది. వారిలో, తాజాగా అరెస్ట్ చేసిన ఫైజుల్ రెహమాన్ కీలక వ్యక్తి.
భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా (ఖిలాఫత్ లేక కాలిఫైట్) మార్చేయాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్న హెచ్‌యుటి సంస్థకు చెందిన రెహమాన్, అతని సహచరులు, కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడానికి పాకిస్తాన్ నుంచి మిలటరీ సహాయం కోసం ప్రయత్నిస్తున్నారని ఎన్ఐఎ తన దర్యాప్తులో కనుగొంది.
రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్న ఇమాం అరెస్ట్:
ఇదే కేసుకు సంబంధించి సమాంతర దర్యాప్తులో భాగంగా గ్రేటర్ చెన్నై పోలీస్ విభాగంలోని సీరియస్ క్రైమ్ స్క్వాడ్ ఒక ఇమామ్‌ను అరెస్ట్ చేసింది. తొండియార్‌పేట్ ప్రాంతానికి చెందిన 32ఏళ్ళ అబ్దుల్ రహీమ్ అలియాస్ సయిట్ అనే వ్యక్తిని అక్టోబర్ 3 రాత్రి అరెస్ట్ చేసారు. హిజ్బ్-ఉత్-తహ్రీర్ సంస్థ కోసం యువతను రిక్రూట్ చేయడం, తన మసీదు ద్వారా అతివాద భావజాలాన్ని వ్యాపింపజేయడం అనే నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఇటీవల జరిగిన వినాయక చవితి ఊరేగింపు మీద దాడి చేసేలా తమ మసీదుకు వచ్చే వ్యక్తులను ఉసిగొల్పాడు. దాంతో తొండియార్‌పేట్‌లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రహీమ్ ఇంటిని సోదా చేసిన పోలీసులకు హిజ్బ్-ఉత్-తహ్రీర్ భావజాలానికి సంబంధించిన సాహిత్యం, కరపత్రాలు, ఇస్లామిక్ ఖిలాఫత్ పరిపాలన ఎలా ఉండాలో వివరించే 17 పుస్తకాలూ లభించాయి. వాటితో పాటు ఒక పెద్ద కత్తిని కూడా పోలీసులు రహీమ్ ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నారు.