మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద గుర్తుతెలియని వ్యక్తి స్క్వేర్ ఐరన్ యాంగిల్ పెట్టాడు. తద్వారా రైళ్ళను పడగొట్టేందుకు ప్రయత్నించాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసామని రైల్వే అధికారులు తెలియజేసారు.
ఆ రైల్వేట్రాక్ మీద ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు డ్రైవర్, పట్టాల మీద ఐరన్ యాంగిల్ ఉండడాన్ని గమనించాడు. దాంతో రైలును స్లో చేసి క్రమంగా నిలిపివేసాడు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసాడు.
‘‘అక్టోబర్ 8 తెల్లవారుజామున 4.30 సమయంలో గ్వాలియర్ రైల్వేస్టేషన్ డిప్యూటీ స్టేషన్ మేనేజర్ నుంచి గ్వాలియర్ జిఆర్పి పోలీస్ స్టేషన్కు మెమో వచ్చింది. తర్వాత రైల్వే అధికారులు, రైల్వే పోలీస్ స్టాఫ్ బిర్లానగర్ రైల్వేస్టేషన్ దగ్గరలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాల మీద స్క్వేర్ ఐరన్ యాంగిల్ ఉన్న సంగతిని గమనించి, సమాచారం ఇచ్చినట్లు గూడ్స్ ట్రైన్ డ్రైవర్ వెల్లడించాడు’’ అని గ్వాలియర్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎం.పి ఠక్కర్ వెల్లడించారు.
గుర్తు తెలియని దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు కేసు రిజిస్టర్ చేసారు. రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని జిఆర్పి స్టేషన్ ఇన్ఛార్జ్ వివరించారు.