బ్యాంకుల మోసాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో వెలుగు చూసిన కుంభకోణంలో వేలాది బాధితులు రూ.100 కోట్లుదాకా పొగొట్టుకున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక వడ్డీలు ఆశ చూపి బ్యాంకు మేనేజర్ నరేష్ చేసిన మోసాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. 2017 నుంచి నాలుగు సంవత్సరాల పాటు చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకు మేనేజరుగా చేసిన నరేష్, 2021 నుంచి నరసరావుపేట బ్రాంచి మేనేజరుగా చేస్తున్నారు.
బ్యాంకు మేనేజర్ నరేష్, గోల్డ్ అప్రైజర్ ఇద్దరూ కలసి రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టారని గుర్తించారు. మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఎంత కాజేశారు, నిధులు ఎక్కడికి తరలించారు, అనే విషయాలను విచారించేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఫిక్స్డ్ డిపాజిట్లు రెన్యువల్ పేరుతో ఖాతాదారుల వద్ద నుంచి ఓటీపీ తీసుకుని బ్యాంకు మేనేజర్ నరేష్ సొంత ఖాతాకు సొమ్ము బదిలీ చేసుకున్నాడని తెలుస్తోంది. బంగారు రుణాలు విషయంలోనూ అవకతవకలు చేశారు. కొందరి ఖాతాదారుల బంగారం బ్యాంకులో లేదని తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై ఐసిఐసిఐ ఉన్నతాధికారులు ఇంత వరకు నోరు మెదపలేదు. మేనేజర్ నరేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం సిట్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.