ఎడారి అంటేనే కరవు ప్రాంతం. అతి కష్టం మీద వెతికితే ఒయాసిస్సులు కనిపిస్తాయి. అక్కడ కూడా నీరు దొరికితే దొరుకుతుంది. లేదంటే తాగడానికి కూడా చుక్కు నీరు లభించదు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారాలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికాలోని మొరాకో దేశంలో గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలో వరదలు ముంచెత్తాయి. లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో వరద నీరు చేసింది. మూడు దశాబ్దాల కిందటే ఎండిపోయిన ఇరికీ సరస్సులో నీరు చేరిన ఫోటోలను నాసా విడుదల చేసింది.
ప్రపంచంలోనే అత్యంత శుష్క వాతావరణం కలిగిన సహారా ప్రాంతంలో వర్షాలు చాలా అరుదుగా పడుతుంటాయి. వేసవి చివరిలో వర్షం పడుతుంది. అయితే గడచిన రెండు మాసాల్లో 250 మి.మీ వర్షపాతం నమోదైందని మొరాకో వాతావరణ శాఖ ప్రకటించింది.
టాగౌనిట్ ప్రాంతాల్లో 24 గంటల్లో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో మొరాకో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్లుగా తీవ్ర కరవుతో రైతులు పొలాలు వదిలేశారు. తాజాగా భారీ వర్షాలకు నీరు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఎడారిలో అతి భారీ వర్షాలు పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.