కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఓడలో గరిష్ఠ సంఖ్యలో కంటెయినర్లను హ్యాండిల్ చేసి రికార్డు సాధించింది.
విళింజం పోర్ట్కు వచ్చిన ‘ఎంఎస్సి అన్నా’ అనే ఓడలో ఒకేసారి 10,330 కంటెయినర్లను హ్యాండిల్ చేసింది. వాటిలో కొన్ని విళింజం వచ్చినవి కాగా మిగిలినవి విళింజం నుంచి బైటకు వెళ్ళేవి. విళింజం పోర్ట్ ఇంకా ట్రయల్ రన్లో ఉండగానే ఈ ఆపరేషన్ పూర్తి చేయగలగడం మరో రికార్డు.
2024 సెప్టెంబర్ 24న విళింజం పోర్ట్లో ‘ఎంఎస్సి అన్నా’ నౌకను డాక్ చేసారు. దాని పొడవు 399.98 మీటర్లు, వెడల్పు 58.6మీటర్లు. ఇది విళింజం పోర్ట్కు వచ్చిన రెండో అతిపెద్ద నౌక.
విళింజం రేవులో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ క్రేన్స్, ఓడ నుంచి కంటెయినర్లను అన్లోడ్ చేసాయి, ఓడలోకి కంటెయినర్లను లోడ్ చేసాయి. ఆ తర్వాత నౌక శ్రీలంకలోని కొలంబోకు వెళ్ళింది. 10,330 కంటెయినర్లను ఒకేసారి మోయడం చారిత్రక రికార్డు అని పోర్టు వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.