శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పొగొట్టి దుర్గగా వెలుగొందినది. దుర్గమాసురుడి వధ అనంతరం దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు సర్వశుభాలనూ కలగజేస్తుంది.
అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి అమ్మవారు కఠోర తపస్సు చేస్తారు. దాని కారణంగా ఆమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దానివలన ఆమె శరీరం గౌరవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పటినుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కారు.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.
లోకభయంకరుడైన దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణగాధ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాస్వరూపమైన అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు.