***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
హిమాలయంలో అది గంగాతీరము. గంగకు స్నానార్థమై వచ్చింది గౌరీదేవి. సుందరమైన భ్రూయుగముచేనొప్పు ఆ సర్వమంగళ దేవతలను ప్రశ్నించింది: ఓ దేవతలారా! మీరీ సమయములో నీప్రదేశమందెవరిని స్తుతించుచున్నారు? ఇలా గౌరి పలుకుచుండగనే గౌరీదేవి శరీరంలోనుండి యొకదివ్యమూర్తి ఆవిర్భవించింది. ఆ అవతరించిన మూర్తి ఇలా పలికింది: యీ దేవతలు శుంభునిచే తిరస్కృతులై రాజ్యభ్రష్టులై నన్నే స్తుతిస్తున్నారు. పార్వతి శరీరకోశంలోనుండి జనించుటచే నీమె కౌశికియని ప్రసిద్ధిచెందెను. ఈ కౌశికి అవతరించినతోడనే పార్వతి శరీరము కాలమేఘంతో సమానంగా నలుపెక్కెను. అదిమొదలు హిమగిరివాసినియగు మహాకాళికాదేవిగా నామె ప్రసిద్ధికెక్కెను. దేవతలా కౌశికను జూచి తమక్లేశములాక్షణంలోనే నశించినట్లానందించిరి.
అనంతరమొకప్పుడు శుంభనిశుంభాదుల భృత్యులగు చండముండులను రక్కసులా దేవిని చూచారు. ఆ అపూర్వ తేజస్సునకచ్చెరువంది, ఆ రూపాని కాశ్చర్యము కలవారై, ఆ లావణ్యాదులకు నిర్విణ్ణులై అతివేగంగా శుంభుని జేరారు. మహారాజా! నేడు హిమాలయంలో నొక అపూర్వము కనుపించింది. అది స్త్రీరత్నము. ముల్లోకాలలోను అట్టి స్త్రీని ఇదివరకెన్నడును కని విని ఎరుగము. ఆ స్త్రీరత్నమును వర్ణించడానికి వాక్యాలు లేవు. ఆ సౌందర్యం వర్ణించడంలో చెడిపోతుంది. చూచే తీరాలి. ప్రపంచంలో ఉండే అమూల్య రత్నాలన్నీ మహారాజులకే చెందాలి. చింతామణి పీఠాన్ని అధిష్ఠించిన తమకే చెందాలి. కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము మొదలగు అమూల్య వస్తువులన్నీ తమ అధీనంలో ఉన్నాయి. వరుణపాశము, కాలదండము, మృత్యువుయొక్క అపూర్వమైన ఉత్క్రాంతికశక్తి మీ అధీనమైపోయాయి. స్వర్ణవర్షం కురిసే వరుణచ్ఛత్రము, నవనిధులు, పుష్పకము మొదలైన అమూల్య వస్తుసముదాయమంతా మీ అధీనంలోనే ఉన్నాయి. ఈ స్త్రీరత్నం కూడా తమ అధీనం ఐననాడే జన్మ సార్థకమౌతుంది. ఇప్పుడుకూడ హిమాలయప్రదేశంలోనే వుందా స్త్రీ. ఆమె నేత్రాలు ఆధారంగా కమలాలు జన్మించాయి. ఆమె కర్ణాలు శ్రీకారానికి ఒరవడిగా ఉన్నాయి. హంసలామెగమనం చూచి నడక నేర్చుకున్నాయి. ఆమె కుచద్వయాన్ని చూచే బ్రహ్మ, చక్రవాక మిథునాన్ని సృజించాడు. ఆ దేహకాంతినుండి మెరపుతీగె లుద్భవించాయి. ఆమె పలుకులు విని చిలుకలు పలకడం ఆరంభించాయి. ఇది అది అననేల ఆమె సౌందర్యరాశి యని వర్ణించారు చండముండులు. ఇంకను ఇలా అన్నారు: మహారాజా! ఆమె ఎవతె? ఆమె వృత్తాంతమేమైనా తమకు తెలియునా? ఎన్నడైనా ఆ అపూర్వ తేజోరాశిని చూచారా? అని ప్రశ్నించారు.
ఆమూలాగ్రంగా విన్నాడు శుంభుడు. సుగ్రీవుడను రక్కసుని బిలచి దూతగా పంపాడు. సుగ్రీవుడు హిమవత్పర్వతం సమీపించాడు. దేవిని చూచాడు. కనులు మిరుమిట్లుగొలిపే ఆ అపూర్వమైన రూపాన్ని అర్ధం చేసుకోలేకపోయాడు. జగన్మాతగా అర్ధం కాలేదు వానికి. అంబతో పలకడం ప్రారంభించాడు.
ఓ దేవీ! నమస్తే! నేను శుంభుని దూతను. నాపేరు సుగ్రీవుడు. నీ స్వరూప స్వభావాలు చండముండుల వల్ల విన్నాడు మా మహారాజు. నన్ను దూతగా పంపాడు. మా మహారాజు వాక్యాలు వినిపిస్తా విందువు గాక, యని శుంభుడు చెప్పి పంపిన వాక్యాలిలా చెప్పడం మొదలుపెట్టాడు సుగ్రీవుడు: ఓ దేవీ! శుంభ నిశుంభులు అన్నదమ్ములు, త్రిలోకాలను జయించిన బాహుబలులు. ఇంద్రాదులచే నూడిగము చేయించుకొను తేజోమూర్తులు. అష్టసిద్ధులు వారిచేతిలో ఉన్నాయి. అఖండమైన త్రైలోక్యరాజ్యలక్ష్మి వారి హస్తగతమైంది. లోకములో ఉండే గొప్ప రత్నాలన్నీ మహారాజుకు చెందుతాయి గాన, నీవు స్త్రీలలో రత్నము వంటిదానవు గనుక మా శుంభ మహారాజుకు చెందుతావు. మా మహారాజుగారి ఆజ్ఞ ఐంది. నీవు వెంటనే శుంభుని చేరి పరిణయమాడి త్రిలోకాలకు మహారాణివి గమ్ము. అట్లు కాదేని నిశుంభుని పెండ్లాడుము. ఈ యిరువురినీ జయించేవారు పదునాలుగు భువనాలలోను లేరు. గాన నీ సౌందర్యాన్ని యౌవనాన్ని సార్థకం చేసుకోవాలంటే శుంభనిశుంభులలో నేయొకరినో వరించాలని మా శుంభ మహారాజు నీతో చెప్పమన్నాడు. సమస్త లోకాలకూ ప్రభువైన శుంభుడో, యువరాజైన నిశుంభుడో భర్త కావడం కంటె నీకు కావలసిన భాగ్యమేముంది. నీ జననము సఫలమైనదని సుగ్రీవుడు శుంభనిశుంభుల గొప్పదనాన్ని వర్ణిస్తూ వారిలో నొకరిని వరింపుమని దేవిని ప్రేరేపించాడు.
జగన్మాత తనలోతాను చిరునవ్వు నవ్వుకుంది. సమాధానం ఇలా చెప్పింది: ‘‘ఓ సుగ్రీవా! నీవు చెప్పిన వాక్యాల్లో అసత్యం లేదు. శుంభనిశుంభులు త్రిలోకాలనూ జయించిన మహావీరులు. అఖండమైన రాజ్యలక్ష్మి వారి హస్తగతమైంది. ఇదంతయు యదార్ధమే గాని స్త్రీనగుట అల్పబుద్ధిచే తెలివితక్కువగ నేనొక ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రతిజ్ఞ నా వివాహానికి అడ్డంగా ఉంది. అదేమన యుద్ధంలో నన్ను జయించాలి లేకుంటే నాతో సమానమైన పరాక్రమం చూపాలి. అట్టి పురుషుణ్ణి గాని వివాహమాడనని నీవు మీ శుంభనిశుంభులతో యీలా చెప్పు. వారు యుద్ధంలో నన్ను జయించడమో నాతో సమానబలాన్ని ప్రకటించడమో చేసి నాచే వరించబడుమనుము.’’
ఆ వాక్యాలు విన్నాడు సుగ్రీవుడు. ‘‘ఓ దేవీ! నీవు పొరబడుతున్నావు. మాలో ఒక్క రక్కసుడు విజృంభిస్తే లోకాలు దద్దరిల్లిపోతాయి. సమస్త దేవతలూ గడగడవణకి స్వాధీనమైపోతారు. అలాంటి స్థితిలో శుంభనిశుంభులతో ఏకాకివి, స్త్రీవి అగు నీకు యుద్ధమా! ఎంత వెఱ్ఱితనము! మా శుంభనిశుంభుల సింహనాదమాత్రం చేత అకాల ప్రళయ శంక కలుగుతుంది. నీ స్త్రీసహజమగు మూర్ఖతను వదులుము. నా పలుకులు విని మా మహారాజును వివాహమాడి ఆనందించుము. అట్లు గాదేని మా మహారాజు నీ కేశపాశాన్ని గ్రహించి లాగికొనిపోవునో నీకు గౌరవహాని కలుగుతుంది. బలాత్కారంగానైనను మా శుంభుడు నిన్ను గ్రహిస్తాడు. గనుక నీవట్టి బలాత్కార స్థితిలో గ్రహింపబడుట నీకు హాని కలుగగలదు. గాన నీవే స్వయంగా శుంభుని వరించమ’’న్నాడు సుగ్రీవ దానవుడు.
తుదకా పలుకులన్నీ విని దేవి యిలా అంది: ఓ సుగ్రీవా! నీ వాక్యాల్లో అనృతం లేదు. గాని నా ప్రతిజ్ఞను నేను విడువను. నన్ను జయిస్తేనేగాని శుంభ నిశుంభులకు నేను లభించనని నొక్కి చెప్పింది. యీ వాక్యాలు మీ శుంభ నిశుంభులతో చెప్పమంది. ఆ పలుకులు విని సుగ్రీవుడు క్షణకాలంలో వెనుదిరిగి శుంభుని చేరాడు.
ఆ సుగ్రీవుడు దేవి వాక్యాలకు చాలకోపం గలవాడై శీఘ్రగమనంతో శుంభుని చేరాడు. జరిగిన వృత్తాంతం చెప్పడం విన్నాడో లేదో! శుంభుడు తీవ్రరూపం దాల్చాడు. దంతములు కటకట కొరికాడు. రాక్షస సేనాధిపతియగు ధూమ్రలోచనుని రావించాడు. ‘ధూమ్రలోచనా! సమస్త లోకాలనూ జయించిన రాక్షసకులాని కొక సామాన్య స్త్రీ వల్ల న్యూనత కలిగింది. ప్రస్తుతమా స్త్రీ హిమాలయాల్లో వసిస్తూంది. నీవు సైన్యాలను తీసుకుని ఆమెను చేరి దేవ దానవ యక్ష కిన్నర గరుడ గంధర్వ గణాల్లో ఎవరు ఎదురించినా సంహరించి ఆమెను సజీవంగా కేశపాశాన్ని పట్టుకుని బలాత్కారంగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
శుంభుని యాదేశాన్ని గ్రహించి అరవైవేల సైనికులతో బయలుదేరాడు ధూమ్రలోచనుడు. హిమాచల ప్రదేశంలో దేవిని చూచాడు, సమీపించాడు. ‘‘ఓ దేవి! నేను శుంభదైత్యుని సేనానాయకుడను. నాపేరు ధూమ్రలోచనుడు. మా ప్రభువు యొక్క ఆజ్ఞ ఐంది. నీవు సహజంగా మా ప్రభువును చేరితివా! మహారాణివగుదువు. లేదా! దేవాదిదేవతలడ్డైనను నిరాకరించి మా ప్రభుసమీపానికి నిన్ను బలాత్కారంగా జుట్టుపట్టి యీడ్చుకుపోగలము. ఇందు నీ యభిమతమేదియో చెప్పు’’మనెను.
ఆ ధూమ్రలోచన వాక్యాలకు దేవి చిరునవ్వు నవ్వి ఇలా సమాధానమిచ్చింది: ‘‘నీవు స్వతః బలశాలివి. పైగా అపార సైన్యంతో వచ్చియున్నావు. ఇవన్నీ ఇలాఉండగా త్రిలోకాలనూ జయించిన శుంభుని యాదేశబలం ఉంది. నిన్ను కాదనువారు ఎవరు? నా నీమమును నేను తప్పను గాన నీ ఇచ్ఛననుసరించి చరింపమనెను.
దేవి పలుకులతో కూడ ధూమ్రలోచనుని క్రోధాగ్ని భగ్గుమంది. సర్వసైన్యాలతో దేవిపైకురికాడు. అలా చూస్తుండగానే సింహాన్ని అధిరోహించింది. దేవి హుంకారం చేస్తే హుంకారాగ్నిచే భస్మమైనాడు ధూమ్రలోచనుడు. మిగిలిన సైన్యాలు యుద్ధం ప్రారంభించాయి. చీల్చిచెండాడుతోంది దేవి. రాక్షసులను చీల్చి రక్తపానం చేస్తోంది సింహం. ముహూర్త కాలంలో ధూమ్రలోచన సహితంగా సర్వసైన్యాలూ నశించాయి. హతశేషుల వల్ల వృత్తాంతం తెలుసుకున్నాడు శుంభుడు. జ్వలించే అగ్నిలో ఆజ్యధారలొలికినట్లయింది. చండముండులను పిలచాడు. ‘‘ఓ చండముండులారా! గతవృత్తాంతం విన్నారు గదా! మీరిరువురు సైన్యాలను ఆయత్తం చేసి దేవిని చేరి అడ్డువచ్చిన వారినందరనూ సంహరించి ఆ సింహమును కూడ యమపురానికి బంపి అంబను బంధించి నా వద్దకు గొనిరండ’ని ఆజ్ఞాపించాడు.
శుంభుని యాజ్ఞను పొంది మహాబలురు మాయావులునగు చండముండులు చతురంగసైన్యాలను వెంటబెట్టుకొని హిమాచలస్థానాన్ని చేరారు. ఉన్నత శిఖరంపై సింహవాహనారూఢురాలై యున్న అంబను చూచారు. ఆ అంబను బంధించడానికి సమీపించారు. అనంత సైన్యాలతో వచ్చిన చండముండులను చూచింది. దేవి తీవ్రరూపం ధరించింది. క్రోధదృష్టిని ప్రసరింపజేసింది. ఆ తీవ్రదృష్టిలో భ్రూమధ్యాన్నుంచి జనించింది మహాభీకరమూర్తియగు కాళిక. పాశము ఖడ్గము ధరించింది. ద్వీపమృగచర్మం ధరించింది. మెడలో పుర్రెలమాల, విచిత్రమైన ఖట్వాంగము, దీర్ఘమై వ్రేలాడు నాలుక, వింధ్యపర్వతగుహవలె విశాలమై భయంకరమైన ముఖము, అగ్నితో సమానంగా జ్వలించే మూడు నేత్రాలు, శుష్కించిన మాంసం గల శరీరము కలదై, కరాళమైన ముఖము కలదై, చూచేవారికి కరాళవదన కాళి అని గోచరిస్తూ సమస్తలోక భయంకరాకారంతో ఉద్భవించి రాక్షససైన్యంలో ప్రవేశించింది.
మహాభీషణాకారంతో రాక్షసులపైకురికి ఆ కరాళవదన ఆ మహాకాళి రాక్షసమూకలను చేతికి దొరికినంత వరకూ భక్షించడం ప్రారంభించింది. ఒక్కొక్కసారి పలువురు రాక్షసులను నములుతోంది. భీకరాట్టహాసం చేస్తోంది. వికట తాండవం చేస్తూంది. చేతులు తగిలి కాళ్ళు తగిలి కరవాలం తగిలి పాశంలో పడి అనేకరీతులుగ హతమారుతున్నారు రాక్షసులు. కళేబరాలు కానరావడం లేదు. కబళించేస్తోంది. సైన్యాలన్నీ నశించిన తోడనే చండముండులు భీషణయుద్ధం మొదలుపెట్టారు. భైరవనినాదం చేసింది కాళిక. చండముండుల పైకురికింది. లోకభయంకరమైన కరవాలంతో లోకభయంకరులైన వారి శిరములు ఖండించింది. ఆ శిరస్సులు గ్రహించి చండిక దగ్గరకు వచ్చింది.
చండముండసంహారానికి చండిక ఆనందించి పలికింది: ఓ కాళీ! ఈ క్షణం మొదలు నీకు చండముండాసుర సంహారం కారణంగా ‘చాముండ’ యను నామమేర్పడుగాక! దేవతలు ఆనందించారు.