తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనించి భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంతో లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. రాత్రికి స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు.
అనంతరం శ్రీ మలయప్పస్వామివారు బుధవారం రాత్రి గజవాహనంపై దర్శనమిచ్చారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడంతో భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. శ్రీవారు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై విహరిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయ గజాలు లక్ష్మీ, మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి నేతృత్వంలో మలయప్ప వాహన సేవ జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన గజాలు ముందు నడుస్తుండగా మలయప్పస్వామి ఆలయ ప్రాంగణంలో విహరించారు.