ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా
వర మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ
సమస్త భూ మండలానికి నాభిస్థానం, శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజున భ్రమరాంబ అమ్మవారికి కాళరాత్రి అలంకారం చేశారు. నవదుర్గా శక్తి స్వరూపాల్లో ఏడో అవతారం కాళరాత్రి, ఈ అమ్మవారినే శుభంకరి అని కూడా పిలుస్తారు. ఈ దేవిని పూజించినంత మాత్రానే భూతప్రేత పిశాచి బాధలు తొలిగిపోతాయి. ఈ తల్లి వాహనము గార్దభవం.
ఈ రూపంలో అమ్మవారు ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందరికీ వరాలు ప్రసాదించును. మరొక కుడి చేయి అభయ ముద్ర కలిగిఉండును. ఒక ఎడమచేతిలో ఖడ్గం, మరొక ఎడమ చేతిలో లోహంతో చేసిన ముళ్ళ లోహ కంటాన్ని ధరించి ఉంటుంది.
ఈ అమ్మవారు చూసేందుకు భయంకరంగా కనిపించినప్పటికీ ఎల్లప్పుడూ శుభఫలములను ప్రసాదించును. ఈమె దయచే భక్తులు సర్వదా భయ విముక్తులు అగుదురు. అమ్మవారు శంభునిశంభులను సంహరించడానికి బంగారు కాంతిని వదిలి నల్లని శరీరంతో రౌద్ర రూపాన్ని ధరించింది.